Tuesday, August 19, 2008

నాన్నగారు

నాన్నగారూ మాకు తెలుసు
మీరు అమ్మ దగ్గరికే వెళ్ళారని
ప్రయణాలంటే మీకు ఇష్టమేకదా

మీరు లేరంటే మీరింక తిరిగి రారంటే
ఎందుకో నమ్మలేక పోతున్నాం

పొద్దున్నే కొళాయిలో నీళ్ళచప్పుడు లాగా
మాకు అలవాటైన మీ అడుగుల చప్పుడు కోసం
రిక్కించిన మా చెవుల్ని
నిశ్శబ్దమే వెక్కిరిస్తోంది.

నాన్నగారూ అన్నం తిందాంరండని
అలవాటుగా పిలిస్తే
పక్కనున్న కంచంలో శూన్యం పరిహాసంగా నవ్వుతోంది.

యథాలాపంగా మీరు విశ్రమించే గదివైపు తొంగి చూస్తే
మీ శరీర సౌరభాన్ని కోల్పోయిన మంచం
ఒంటరిగా దిగులు చూపులు విసురుతోంది.

మీరున్నారంటే
ఆకాశమంత ఆశీర్వాదం
మాకు గొడుగుపట్టినట్టుగా ఉండేది

మీరు పక్కనుంటే
ఒక నది పక్కనున్నట్టు
మీరు చెంతనుంటే
చెట్టునీడనున్నట్టు
మీరు మా మధ్యనుంటే
చీకట్లో దీపం చుట్టూ కూర్చున్నట్టు
కొండంతా ధైర్యంగా ఉండేది.

మీరు ఎక్కడున్నా
టెలిఫోనులో అమ్మా అంటూ నాన్నా అంటూ
మీ పలకరింపు వింటే
ఒక చల్లని మబ్బుతునక
మా వీపుల్ని తడుముతున్నట్టుండేది.

ప్రేమించడమేగాని ద్వేషించడం తెలీదు మీకు
క్రమశిక్షణ మీరు మాకిచ్చిన నజరానా
స్థితిప్రజ్ఞత్వానికి మీరే చిరునామా

నాన్నగారూ
మీరు మాకు పాఠాలు భోధించారు కాని
జీవన రహస్యాలు చెప్పలేదు
షెల్ఫ్ లో దాచివుంచిన గొప్ప పుస్తకంలాగా
మీరు మా మధ్యనే ఉన్నా
మిమ్మల్ని చదవడానికి ఏనాడూ మేం సాహసించలేదు.

ఏ మహాగ్రంథాలూ చదవనవసరం లేదు
ఏ మహాయుద్ధాలు చెయ్యనవసరం లేదు
మీ బతుకు పుస్తకాన్ని తెరిస్తే చాలు
మా బతుకుల్ని మేం చక్కదిద్దుకోగలం

మీరు మాస్టారు కదా!
క్రమశిక్షణ తప్పి డబ్బుపొరలు కప్పి
స్వార్థాలు ఏవో మమ్మల్ని విడదీస్తున్నప్పుడు
ద్వేషాలు ఏవో మమ్మల్ని లొంగదీసుకుంటున్నప్పుడు
మళ్ళీ ఒక సారి
బెత్తం పట్టుకుని రావాలి సుమా!

నాన్నగారూ!
అమ్మతో పాటు ఆకాశంలో
మీరలా వాహ్యాళికి వచ్చినప్పుడు
మాకోసం మీ కళ్ళు వెదుకుతున్నప్పుడు
మీ చల్లని దీవెనల విరిజల్లుల కోసం
మేం దోసిళ్ళుపట్టుకు నిలుచుంటాం.

[నన్ను కన్న కొడుకులా ప్రేమించిన మా మామగారు కలపాల వెంకటేశ్వర రావు గారి స్మృతిలో]