Wednesday, December 3, 2008

ఒబామా! ఒబామా!


కంటికి కునుకు లేదు
రెప్పల మీద నీ చప్పడే
మనసు లోతుల్లో
ఏదో మంచుపొర కరుగుతున్న ఒక నిశ్శబ్ద సౌరభం.
యాభయ్యారక్షరాల నా తెలుగు శౌర్య సౌందర్యం
నీ నీలి దేహం మీద
పూల రేకులై కురుస్తున్న పులకింత

ఒబామా! ఒబామా!
కాలం చాలా తమాషా చేసింది
ఒక యుద్ధ రాక్షసి నెత్తి మీద నిన్ను
నీలి నక్షత్రంలా కూర్చోపెట్టింది
వైట్ హౌస్ ను లైట్ హౌస్ గా మార్చే
బీకన్ కాంతి వలయం నువ్వు కావాలని
చరిత్ర ఆశ పడుతోంది కాబోల

అమెరికా అంటే సామ్రాజ్యమే కాదా
నెత్తుటి కోరల దుర్మార్గమే కదా
నీ గెలుపు నా కలానికిప్పుడు
కనపడని కళ్ళెమై చుట్టుకుంది

రెడ్ ఇండియన్ల ఊచకోతలో
తాగిన నెత్తురు మత్తులో జోగుతున్న దేశం నీది
అణచివేత ఓడలెక్కి
కల్లోల సాగరాల కాగితాల మీద
కపట రచనలు చేసే కోట్లాది కొలంబస్ ల కోట నీది
వియత్నాం నుండి ఇరాక్ దాకా
భోంచేసిన మానవ కళేబరాలు జీర్ణం కాక
రోడ్డురోలర్ లై దొర్లుతున్న డాలర్ డైనోసార్ల రాజ్యం నీది

కాలం ఇప్పుడు ఏదో విచిత్రమే చేసింది
నల్లవాడా!
రక్తం రంగేదో కనుక్కోవాలని
ఆ నెత్తుటి ధారలతో గతం పాపాన్ని కడుక్కోవాలని
ఒక తెల్లవాడు తన చర్మాన్ని ఎన్ని సార్లు కోసుకోవల్సివచ్చిందో
ఎన్ని ఆధిపత్యాల కోటపేటల్ని కూల్చుకోవల్సివచ్చిందో
ఎన్ని అహంకారపు ఆకాశాలను కాల్చుకోవల్సివచ్చిందో

నిన్ను చూసి
నీ విజయోత్సవ సంగీత సవ్వడి విని
ఒక శ్వేత జాతి గుండెకాయ
వెచ్చటి కన్నీటి బొట్టయి
టీవీల తెరల మీద పొరలి పొరలి కదలాడిన దృశ్యం
మనిషి చరిత్రకు కాలం చెప్పిన కొత్త భాష్యం

ఇంతకీ ఇదంతా కల కాదు కదా
ఒబామా అంటే సంక్షోభం గట్టేక్కడానికి
అమెరికన్లు కూడబలుక్కుని ప్రకటించుకున్న
బెయిలౌట్ ప్యాకేజీవి కాదు కదా
నీ రంగు చూసి మేము పొంగిపోవడం లేదు కదా
ఏమో! మాకు మాత్రం నువ్వు
మార్టిన్ లూథర్ కింగ్ స్వప్నంలా కనపడ్తున్నావు
పాల్ రాబ్ సన్ పాటలా వినబడుతున్నావు
ఒబామా! ఒబామా!
శ్వేత సౌధానికే కాదు ప్రపంచ శాంతి సౌధానికి కూడా నువ్వు
కాంతి తోరణమై వేలాడాలి సుమా

భయం లేని ప్రపంచం

నాకు పసిపిల్లల కళ్ళు కావాలి
పావురాల రెక్కల కింద
నిశ్శాబ్దపు నీడల వెచ్చదనం కావాలి

నేను గుడ్డివాడిని కదా
రాత్రి నా రెండు కళ్ళూ
రెండు సజీవ భాష్పకణాలై
నా గుండెన
నిటారుగా చీల్చి
రెండు రెక్కలు చేసుకుని
ఎటో ఎగిరిపోయాయి
ఎవరి పాదాల మీదో మోకరిల్లి
అవి ప్రార్థనలు చేస్తున్నాయి
భయం లేని ప్రపంచం కోసం
ప్రాధేయ పడుతున్నాయి

పువ్వులంటే చెట్టుకీ
చెట్టంటే మట్టికీ
మట్టంటే మనిషికీ
నువ్వంటే నాకూ - నేనంటే నీకూ
నేలంటే ఆకాశానికీ
భయం లేని ప్రపంచాన్ని
కలగన్న నా కళ్ళు నన్ను మోసం చేసి
నా కళ్ళు కప్పి తిరుగుతున్నాయి

బడి పిల్లల ఆటస్థలం
తన గుండె సంగీతమౌతున్న
అడుగుల చప్పుళ్ళని
అసహాయంగా చూస్తోంది
పక్షుల ఆటస్థలం
చుక్కల్ని వెతుక్కుంటూ
ఎవరి చేతులో పట్టుకుని
ఏదో బతిమాలుకుంటోంది
బహుశా భయం లేని
ఆట కోసం కాబోలు

గుడ్డివాడిని కదా
నేను ప్రేమించే అక్షరాలేవో
నన్ను పరామర్శిస్తున్నాయి

వెన్నెలా మంచూ పువుల్లూ పిల్లలూ
నలుగురై
నిన్ను మోసుకుని వెళతారులే అని ఓదారుస్తున్నాయి

భయం లేని స్మశానంలో
నేను తన్మయంగా తగలబడడం
నా కళ్ళు ఆకాశంలోంచి చూసి
రెండు కన్నీటి చుక్కలు ఆనందంగా రాలుస్తున్నాయి
కనీసం పిల్లల కోసమైనా మనం
పెద్ద మనసు చేసుకుని బతుకుదామని
జాలిగా శాసిస్తున్నాయి

Saturday, October 18, 2008

ప్రేమ


భూమ్మీద మనిషి కాలాన్ని
ఒక్క రోజులో కుదిస్తే
అది ప్రేమికుల రోజు కావాలి


ప్రపంచం సమాధిలో
రెండు సజీవ ఆత్మలు
సమాధి చుట్టూ
కోట్లాది పాదముద్రలు


జీవితంలోనూ మరణంలోనూ
మరణానంతర జీవితంలోనూ
కురిసే వెలుగుజల్లు ప్రేమే కావాలి


అలకతో ఓ అమ్మాయి విసిరిన పుస్తకాల సంచి
రోడ్డును ప్రేమ లేఖల మొగలి పొత్తు చేసింది


ప్రేమ ఖండాన్ని కనుక్కోవడంలో
ఎవడికి వాడే ఓ కొలంబస్

తనను రోడ్డు దాటించిన చేయి
కబోదికి కలలో కనిపించడం ప్రేమ

స్వార్థమూ త్యాగమూ
కొత్త దంపతుల్లా ఆడుకునే
పూలబంతి ప్రేమ

తెగిన గిటారు తీగల్లో
విషాదమై ప్రవహిస్తున్న పెదాల అన్వేషణ ప్రేమకోసమే
మనుశుల్ని కరెంటు తీగల్ని చేసి
ప్రపంచమ్ పందిరికి వేలాడే బల్బు పువ్వు ప్రేమ
శరీరాల సంగీతానికి
హృదయాలు కూర్చే లిరిక్ ప్రేమ

చెబితే ప్రేమ గురించే చెప్పాలి
మనుషులు ప్రాణాలతో అల్లుకున్న
దీపాల గూటిలో నిత్యం కువకువలాడే
ప్రేమ పక్షి గురించి చెప్పాలి

పాటను వెదుక్కుంటూ పయనమైన
ఒంటరి పడవ
నదిమధ్య కొండకు తలబాదుకోవడం గురించి చెప్పాలి

ఎక్కడో పారేసుకున్న సెల్ ఫోనులో
నువ్వెదురు చూస్తున్న కాల్ మిస్ కావడం ప్రేమ

ప్రేమ ఎస్సెమ్మెస్సులు కాదు
అలాగని ఫ్లయింగ్ కిస్సులూ కాదు

ప్రేమ నాలుగు చేతుల రహస్య ఒప్పందమే కాదు
అది మనిషి నుండి మనిషికి
అనాదిగా ప్రవహిస్తున్న నిశ్యబ్ద సంగీతం

ప్రేమ చీకటి వెన్నుల్లో
మెత్తగా దిగబడే వెన్నెల
ప్రేమ ఎడారి గుండెలో నీటి కత్తి
నిద్దుర రెప్పల మీద మత్తగా జోగే మెలకువ ప్రేమ

ఒక అంధ యువకుడికి
మూగ పిల్ల చేసిన కొంటె సైగ
నిన్నూ నన్నూ వెక్కరిస్తుంది ప్రేమగా

ఎవరిని ఎవరు ప్రేమించినా అందరినీ అందరూ ప్రేమిస్తున్నట్టు
మనుషులంతా ప్రేమికులు కావాలి
రోజులన్నీ ప్రేమికుల రోజులవ్వాలి.

Monday, October 13, 2008

వీరులు ప్రజల హృదయాల్లో ఉంటారు

వీరులు విగ్రహాల్లో కాదు
ప్రజల హృదయాల్లో ఉంటారు
ప్రజల ఆశల్లో ఉంటారు
ప్రజల అడుగుల్లో ప్రజల మాటల్లో
ప్రజల గుండె చెప్పుళ్ళలో
వీరులు గర్వంగా నవ్వుతూ ఉంటారు


విగ్రహాలను మలినం చేస్తే
వీరులు మాయమైపోరు
అది మరో విస్ఫోటానికి నిప్పంటిస్తుంది


విగ్రహాలు కూల్చేస్తే వీరులు చచ్చిపోరు
ఆ విగ్రహాలను తమ రక్తంతో నిర్మించుకున్న
జాతిజనుల ఊపిరిలో ఉంటారు.


సముద్రం మీదికి వొంగిన ఆకాశంలో వీరులుంటారు
సూర్యుడు గుప్పిళ్ళతో జల్లుతున్న
కాంతి కిరణాల్లో వీరులుంటారు
ఉదయాన్ని రెక్కల మోసుకుంటూ
ఎగిరే పక్షుల్లో వీరులుంటారు


అణగదొక్కడం అవమానించడం
మీ సంస్కృతి కావొచ్చు
రెచ్చగొట్టడం చిచ్చుపెట్టడం
మీకు చేతనైన విద్య కావచ్చు


కూలిన విగ్రహాల్లోంచి
కోట్ల పిడికిళ్ళు మొలకెత్తడం
ఇక అందరం చూస్తాం
వీరులు మట్టిబొమ్మల్లోనో చిత్రపటాల్లోనో ఉండరు
ఉక్కు పాదాలు తొక్కిన నేలంతా
పొడుచుకొచ్చిన కత్తుల కాంతుల్లో వీరులుంటారు


కలిసి నడిచే పాదాలు
నేల మీద రాసే నినాదాల్లో వీరులుంటారు
వీరులు జనంలో ఉంటారు
జనం జరిపే రణంలో ఉంటారు
వీరుడు అంబేడ్కర్.

Sunday, October 12, 2008

బౌద్ధ సంగీతం


మాటలు లేని శబ్దాలు లేని
ఒక సంగీత సౌఖ్యం కావాలి

వెన్నెల మాట్లాడదు
పువ్వులూ పిల్లల నవ్వులూ మాట్లాడవు
శాక్యముని నిమీలిత నేత్రాలు కూడ.

ఇది మరో ప్రపంచాన్ని
కలగంటున్న మౌన సంగీతం
మంచు కడిగిన మనుషుల మనస్సుల్ని
భిక్షా పాత్రల నిండా నింపుకుని
సమూహాలు సమూహాలుగా కదలిపోతున్న
కాంతి వలయాల శాంతి సంగీతం

ఆ కదలని విగ్రహంలో
అనాదిగా అనంతంగా కురుస్తున్న ప్రశాంత సంగీతం
మనుషులంతా చిట్టి పిల్లలై
తెలతెల్లని మబ్బుగువ్వలై ఆడుకుంటున్న ఆకాశ సంగీతం
విశుద్ధ వినిర్మల బౌద్ధ సంగీతం

కురుస్తూ కురుస్తూ
కురుస్తూనే మెరుస్తూ
నడుస్తూ నడుస్తూ నడుస్తూనే నవ్వుతూ
ప్రేమ పుష్పాల జడిలో తడుస్తూ
సన్నగా చల్లగా తన్మయంగా
గుండెల్ని తాకే
లౌకికాలౌకిక భౌతికభౌతిక
సాత్విక తాత్విక సంగీతం.

అమ్మ పొట్టలో వినిపించిన సంగీతం
అమ్మ ఉయ్యాలలూపినప్పుడు కన్పించిన సంగీత
బడిలో తోటలో చెట్టుతో నీడలో నీళ్ళతో
ఆడుకున్నప్పుడు మైమరపించిన సంగీతం

చేతుల తీగల్ని ప్రపంచమంతా అల్లుతూ
ప్రవహిస్తున్న పరిమళం సంగీతం
వసుధైక గీతానికి
మొదటి చివరి మంత్ర స్వరం

కాలం కంటే ముందు పుట్టి
కాలం ముందు పరుగు తీస్తున్న
ఒక చిరుపాప చిరునవ్వు సంగీతం

నేలమీద మన మనస్సుల మీద
విస్తరించిన సరిహద్దుల రేఖల్ని
తొక్కుకుంటూ చిందులేసే
సన్యాస సమ్మోహ సంగీతం

మన లోపలా బయట
కనిపించీ కనిపించని ఆయుధాల పైనా
అహంభావాల పైనా
స్వార్థ సామ్రాజ్యాల పైనా
దాడి చేసే నిరాయుధ రహస్య సంగీతం

దిక్కులన్నిటికి దిక్కు చూపే
దేవుళ్ళకు కూడా బుద్ధి చెప్పే
మనుషలందరిని ఒకే ఉయ్యాలలో ఊపే
సజల సంగీతం సౌమ్య సంగీతం
బౌద్ధ సంగీతం

బుద్ధం శరణం గచ్ఛామి......

[గౌతమబుద్ధని 2550వ జయంతిని ఈ ఏడాది ప్రపంచమంతా జరుపుకుంటోంది]

ఆశ ఛావెజ్

పొగచూరిన ఆశల ఆకాశాన్ని
ఒక అరుణారణ రుతు పవనం చల్లగా
కలత చెందే ఆశయాల కనురెప్పలను
ఓ ఎర్రటి చినుకు కొత్త కలై పలకరించింది
ఈ అణచివేతల దమననీతుల కాలంలో
మరో సారి వెనుజులా విప్లవాల ఛీర్స్ కొట్టింది
వీరుడు ఛావెజ్.....ధీరుడు ఛావెజ్
విప్లవం ఛావెజ్..... విక్టరీ ఛావెజ్.

అర్జెంటీనా ఫ్యాక్టరీ గొట్టాల నుండి
దూసుకొస్తున్న ఎర్రని పొగమబ్బుల్లో ఛావెజ్
బొలీవియా నీటి గొంతులో
పోటెత్తిన ఎర్రెర్రని అలల సంగీతంలో ఛావెజ్
లాటెన్ అమెరికా పోరుదారిలో
విరిసే తొలిపొద్దు పువ్వులో ఛావెజ్
ఆశ ఛావెజ్....ఆర్తి ఛావెజ్...

గతించిన వీరుల శౌర్య దీప్తుల్ని
పిడికిట్లో బిగించి వెనుజులా
దెయ్యాల రాజ్యం ఎదుర్రొమ్ముపై గుద్దింది
అణగారిన దేశాల ఆగ్రహ జ్వాలల్ని
కన్నుల్లో నింపుకుని వెనుజులా
కయ్యాల రాజుపై కన్నెర్ర చేసింది
హక్కుల పోరాటానికి కొత్త నెత్తురెక్కింది
విలువల యుద్దానికి ఒక వింత వెపన్ దొరికింది.

ఆకాశాన్ని జెండాగా వెన్నుపూసపై అతికించుకుని
వెనుజులా ప్రపంచమంతా ఎగిరింది
ఊపిరి ఛావెజ్....ఉద్యమం ఛావెజ్
ఇక ఎక్కడబడితే అక్కడ..
పిల్లల కళ్ళల్లో ఛావెజ్
పిల్లల కథల్లో ఛావెజ్
సామ్రాజ్యవాదుల పీడకలల్లో ఛావెజ్

[వెనుజులా ఎన్నికల్లో ఛావెజ్ ఘనవిజయాన్ని స్మరించుకుంటూ...]

జెండాకు సంకెళ్ళు

చాలా రోజులుగా నా కళ్ళు
రాజమండ్రి రహదారిమీద తచ్చాదుతున్నాయి

నా కలం
రాజమండ్రినుండి వచ్చే
బస్సుల్నీ రైళ్ళనీ అదే పనిగా గాలిస్తోంది
ఏవేనో జ్ఞాపకాలు కనురెప్పల మీంచి
టపటపా రాలిపోతూనే వున్నాయి

ఇప్పుడు నా గుండె
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడగడియారం మీద కూర్చుంది
అక్కడ మా మిత్రుడున్నాడు

పోరాడే జెండాలను జైల్లో పెడితే
అవి గోడలకు రెక్కలు తొడుగుతాయి
నినదించే కంఠాలకు సంకేళ్ళు వేస్తే
అవి ఆకాసాన్నే నినాదంగా మార్చేస్తాయి

అతనికి నచ్చిన పాటాలన్నీ జాగ్రత్తగా మడత పెట్టి
సంచినిండా పెట్టుకుని
క్యారియర్ నిండా అక్షరాలు నింపుకొని
నాకు తెలికుండానే నా మనసు ఎప్పుడో
రాజమండ్రి జైలు దగ్గర బైఠాయించింది
అక్కడ మా చెలికాడున్నాడు
విప్లవాల విద్య తెలిసిన విలుకాడున్నాడు.

లోపలికీ బయటకీ తేడా తెలిసిన వాడు
మంచికీ చెడ్డకీ దూరం కొలిచిన వాడు
అందరి మనసూ గెలిచిన వాడు

అక్కడ ఒక తాత్వికుడున్నాడు
ఒక స్వాప్నికుడున్నాడు
ప్రజల ప్రేమికుడున్నాడు

జంగారెడ్డిగూడెం గిరిజనులు కన్నీటితో కట్టిన
స్వాగతమాలను పట్టుకుని
ఇప్పుడు నా రెండు చేతులూ అకాశంలో అలా వేలాడుతున్నాయి.

[ప్రజల పక్షాన పోరాడినందుకు జైలు శిక్ష అనుభవించిన మిత్రుడు మంతెన సీతారాం కోసం]

Saturday, October 11, 2008

వీరులు బతకాలి

ఇల్లు ఖాళీచేసినంత సులువు కాదు
దేహాన్ని ఖాళీ చెయ్యడం


ఎంత సునాయాసంగా ఎంత చిద్విలాసంగా
ఎంత పరిహాసంగా
వెళ్ళి పోయావురా తమ్ముడూ!


ఆఫీసుకు వెళుతూ పిల్లల చేతుల్లో నాలుగు డబ్బులుంచిన్నట్టు
మా కళ్ళల్లో ఒక దుఃఖ సముద్రాన్ని పెట్టి వెళ్ళి పోయావు


అందరం ఇక్కడ ఉండిపోవడానికే రాలేదుగానీ
నువ్వు మాత్రం వెళ్ళిపోవడానికే వచ్చినట్టు
ఒకటే తొందరపడ్డావు


ఈ అగ్నిశిశువును ఎత్తుకోవడం
మా వల్లకాదేమోనని
నీ తొలి ప్రేమ స్పర్శలోనే నాకనిపించింది.


ఒరెయ్ నాయనా
ఇక్కడ బతకడమే గొప్పకదరా!
క్యాలండర్ మీద దుమ్ము దులపడం
గడియారం ముల్లు కదపడం
బతుకంటే బతకడమే
అదే విప్లవం - అదే జీవరహస్యం


ఎవడు ఎన్నేళ్ళు బతికాడన్నదే లెక్క
వందేళ్ళు బతికినవాడే చక్రవర్తి.


నువ్వేంటో చావుని చంకలో పెట్టుకొచ్చినట్టు
ఒకటే కంగారు పడ్డావు
అయితేనేం
బతికిన క్షణకాలమైనా బతుకును బతికించాలన్నవు
వసంతాలు గణించుకోవడం కాదు
అభిశప్తవనాల వాకిళ్ళవైపు పచ్చదనాన్ని తోలుకొచ్చే
వసంతోత్సవానివి నువ్వే కావాలన్నావు.
బతుకంటే అక్షరమన్నావు
గుప్పెడు అక్షరాలను ఎక్కడ ఒలకబోసినా
అవి నిప్పు పిట్టలై
కపటారణ్యాలను
తగలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నావు


అవును నువ్వు పొగరుమోతు కవివే
అనార్కిస్టువే
అంటరాని అక్షరానికి ధిక్కార చొక్కాతొడిగి
కాలరెగరేసుకు తిరగమన్నావు
తెల్లమనువులూ ఎర్రమనువులూ
తెల్ల మొగాలు వేసుకు చూస్తోంటే
వాడమగాడికి మొలతాడుకట్టి
మీసం మెలేసిన మొనగాడివి నువ్వు


నిన్ను చూడ్డానికి
ధైర్యం చాలని వాళ్ళకి తెలీదుగాని
నువ్వు ఉగ్రవాదిగా అగ్రహారాల మీద
బాంబులు విసిరినప్పుడే అనుకున్నాను
ఈ పట్టపగ్గాల్లేని గుర్రాన్ని
పట్టుకోవడం మా చేతకాదని


నువ్విక్కడ ఎవర్నీ చూసి ఎవర్నీ చూసి ఏమీ నేర్చుకోలేదల్లేవుంది
నిత్య సన్మానాలతో నిత్య కళ్యాణాలతో కాకున్నా
నిత్యమూ మృత్యు సంభోగాలతోనైనా
ఇక్కడ బతకడమే గొప్ప

మరి నువ్వేమో
జీవితాన్ని కాలంతో కాదు
కాలాన్ని జీవితంతో లెక్కించాలని
చెప్పడానికే వెళ్ళిపోయినట్టున్నావు

ఓనా ప్రియాతిప్రియమైన సోదరుడా
నువ్వు బతికుంటేనేకదా
ఈ బతుకు బతుకు కాదని తెలుసుకునేవాళ్ళం
నువ్వు సజీవ జీవన ప్రవాహమై
మమ్మల్ని ముంచెత్తితేనెకదా
స్వచ్ఛంగా శుభ్రంగా బతికేసే వాళ్ళం

ఉద్యొగానికి సెలవు పెట్టినంత తెలిక కాదు
జీవితానికి టాటా చెప్పడం.

ఎంత్ ఈజీగా ఎంత పొగరుగా
ఎంత ఆత్మగౌరవంగా
వెళ్ళిపోయావురా నేస్తం!

అది సరె
అవసరాల మచ్చలు కనబడకుండా
ప్రేమ అత్తర్లూ స్నేహాల పౌడర్లూ పూసుకు తిరుగుతున్న
మా బతుకులు నీకు నచ్చలేదు అనుకుందాం
మరి నిన్నే అల్లుకుని పల్లవించిన
ఆ తీగపిల్ల మాటేమిటి!
నీకోసం విరిసిమురిసిన
ఆ జంట పుష్పాల లేతగొంతులు
నాన్నేడని అడిగితే
అన్ని చుక్కల్లో ఏచుక్కని చూపమంటావ్?

నిత్యం వందిమాగదులతో యువరాజులా తిరిగే
చెట్టంత కొడుకు చటుక్కున కూలిపోతే
తల్లడిల్లి పోతున్న ఆ తల్లిపేగు దుఃఖాన్ని వర్ణించడానికి
అక్షరాలను ఏ లోకాలనుండి అరువు తీసుకు రమ్మంటావ్?

ఇక్కడ ఉండిపోవడానికే ఎవరూ రాలేదుగానీ
నువ్వు మాత్రం వచ్చినపని ఆయిపోయినట్టు
వెళ్ళిపోవడానికే కంగారుపడ్డావు

అందుకే తమ్ముడూ
నీ సమాధిమీద తలలుబాదుకుంటూ
మా రక్తంతో ఒకేమాట రాస్తున్నాం
"వీరులు బతకాలి"

[వెలివాడల్లో వేనవేల నగేష్‍బాబులు పుట్టాలని కోరుకుంటూ]

గ్లాడిస్ స్టెయిన్స్

[1999 లో గ్రాహం స్టెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ ఫాదర్‍ని అతని కొడుకులిద్దరని ఒరిస్సాలో భజరంగ్ దళ కార్యకర్తలు దహనం చేశారు. నిందితులకు చాలా సంవత్సరాల తర్వాత కోర్టు శిక్ష వేస్తే గ్రాహాం స్టేయిన్స్ భార్య గ్లాడిస్ వారిని క్షమిస్తున్నట్టు ప్రకటించింది]

తల్లి నీకు వందనాలు.
మతమంటే క్షమాగుణమని
మా క్రూరాత్మలకు నూరిపోసిన
నీ ఔదార్యానికి స్తుతులు స్తుతులు.

నీ కట్టుకున్న వాణ్ణి, కన్న బిడ్డల్నీ
మా మతోన్మాదం కాల్చి బూడిద చేస్తే
మమ్మల్ని కనికరించమని ఆ దేవుణ్ణి ప్రార్థించిన
కరుణా మూర్తి నీకు జేజేలు

ఎవదో రైలు తగలబెట్టినందుకు
రాష్ట్రాన్నే తగలబెట్టిన రాక్షసులంమేము
గర్భస్థ పిండాలను త్రిశూలాలకు గుచ్చి
వీధుల్లో వీరంగం వేసిన వీరభక్తులం మేము

పచ్చి బాలెంతులను ముక్కుపచ్చలారని ఆడపిల్లలను
చెరిచి జబ్బ చరిచిన భక్త యోధులం మేము
కాటికి కాళ్ళు చాచిన ముసలి వాళ్ళను
కాళ్ళూ చేతులూ కట్టి నూతుల్లో పడేసిన
ముక్తి ప్రదాతలం మేము
ప్రతీకారం మామతానికి పర్యాయ పదాన్ని చేసిన
అతీంద్రియ శక్తులం మేము

అమ్మా! ఒక్క సారి నీ చల్లని చేతులు తాకాలని వుంది.
సోదరి! ఒక సారి నీ దయగల నేత్రాలను చూడాలని వుంది.
నీ పాదాలను కడిగి మా పాపాలు కడుక్కోవాలని ఉంది.

మా కుష్టు రోగాన్ని నయం చేయడానికి వచ్చిన
ఓ దేవతా!
నువ్వు మమ్మల్ని చిరునవ్వుతో క్షమించినా
దేవుడు క్షమిస్తాడంటావా?

Thursday, September 25, 2008

ఆయుధం

దేవుళ్ళు కూడా మారణాయుధాలు పట్టుకు తిరిగే దేశంలో
ఆయుధ బకాసురులు
సగానికి పైగా బడ్జెట్టుల్ని భోచేస్తున్న సన్నివేశంలో
నాయకుల భద్రతకోసం కట్టే
ఆయుధాల కోటలకే కోట్లు ఖర్చయి పోతున్న కాలంలో
ఆయుధం మీద చర్చ్
నిజానికి చిత్రంగానే ఉంటుంది.


ఆయుధంమీద ఆయుధం నిఘావేస్తున్న వేళ
ఆయుధాన్ని ఆయుధం నిషేధిస్తున్న వేళ
ఎటుతిరుగీ ఎండింగ్ ఎన్‍కౌంటరే అని
తేలిపోయిన వేఅ
ఆయుధాల మీద చర్చలు కాస్త చికాగ్గానే వుంటాయి.


పక్షులు తుపాకులు పట్టుకు తిరగటం
అడవికి అభ్యంతరం కానప్పుడు
వేటకాడు వేలఎత్తిచూపడం కొంత వింతగానే వుంటుంది.


ధాన్యాగారాల కంటే
ఆయుధ గిడ్డంగులే అధికంగా ఉన్న చోట
ఆయుధాన్ని చూసి ఆయుధం భయపడ్డం
ఆశ్చర్యంగానే వుంటుంది.


ఎందుకన్నా మంచిది
పిల్లల బ్యాగుల్ని కాడా వెదకండి
తుపాకులుండొచ్చు
అలా పొలాల్లోకి పొయి చూడండి
మొక్కలు ఆయుధాలవుతున్నాయేమో.

కలల పరిమళాలు

దయచేసి పిల్లల్ని కొట్టొద్దు
పువ్వులు బాధపడతాయి
పిల్లలంటే మాటలూ నడకలూ నేర్చిన మన కలల పరిమళాలు
పిల్లలంటే జీవితమంతా మనం కష్టపడి రాసుకున్న కవితలు.

దయచేసి పిల్లల్నితిట్టొద్దు
చంద్రవంకలు బిక్కమొహం వేస్తాయి
పిల్లల్ని బెత్తాలతో కాదు
ప్రేమనిండిన చిత్తాలతో పలకరించాలి.

వెన్నెల ఒళ్ళంతా పూసుకుని మెరిసిపోతున్న
కోనేటి నీటిని
మునివేళ్ళతో తడిమినట్లు
పిల్లల్ని లాలనగా
స్పృశించాలి
పిండిగువ్వల్ని చేతుల్లో తీసుకున్నట్టు
పిల్లల్ని అక్కున చేర్చుకోవాలి.

దయచేసి పిల్లల్ని కసురుకోవద్దు
చిలకలు చిన్నబోతాయి
పిల్లలు మన తీయ్యటి జ్ఞాపకాలు
పిల్లలు మన రేపటి జాతకాలు.

పాలకంకులమీద పిచ్చుకలు కళ్ళుపారేసుకున్నట్టు
పిల్లల అడుగుల మీద మనం బతుకుల్ని ఆరేసుకోవాలి
పిల్లలు మన ఊహల విహాయసాలు
పిల్లలు మన ఆశల ఆకాశాలు
పిల్లలు మన ప్రతిరూపాలు.

దయచేసి పిల్లల్ని కొట్టొద్దు
ఒళ్ళంతా ప్రేమ నిండిన కళ్ళతో అలా చేతులుచాపండి
వంద హరివిల్లులు మీ దోసిట చిందులేస్తాయి.

పద్యం పండగ చేసుకుంది

[ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలర్పించిన వేలాది నేపాల్ వీరుల కోసం]

మానవ హక్కులతో
తలపడీ భంగపడీ
ఒక కిరీటం ముక్క ముక్కలైంది

యువకుల రక్తంతో ఆటలాడి
ఒక సింహాసనం
మట్టి పెళ్ళల్లో కూరుకుపోయింది

నిజంగా
నా పద్యం ఇప్పుడు పండగా చేసుకుంటోది
నా వాక్యం ఇప్పుడు
తన పై తానే రంగులు జల్లుకుంటోది

మంచుకొండల మధ్య
ఎగిసిపడుతున్న అగ్నితరంగాలను కౌగలించుకుని
నా మనసు ఇప్పుడు
ప్రజాస్వామ్యం పాట పాడుతోంది

జీన్ ప్యాంటూ టీషర్టూ తొడుక్కొని
నా అక్శరాలు ఇప్పుడు
హిమలయాల వీధుల్లో
ప్రజాస్వామ్య పతాకాన్ని
మోసుకుంటూ తిరుగుతున్నాయి

ఒక రాజప్రసాదం మీద
కాలం వీథి కుక్కయి
ఒంటేలు పోస్తోంది
జ్ఞానేంద్రుడి కళ్ళలో చరిత్ర మణ్చుకత్తై
దిగబడుతోంది

ఆ మనోహర దృశ్యాన్ని
శీతల శిఖరాల తుహిన ఫలకాలమీద
సూర్యుడు వేయిరంగుల చిత్రకావ్యంగా రచిస్తున్నాడు.

స్వెటర్లు వేసుకుని మఫ్లర్లు చుట్టుకుని
నా కవితలు ఇప్పుడు
ఆ హిమవన్నగ సామ్రాజ్యంలో
విప్లవ గుడారాల ముందు పహరా కాస్తున్నయ్.

ఆ తేయాకు తోటల్లో
ఆ బాస్మతీ పంటభూముల సువాసనల్లో
ఆ చిన్ని కళ్ళ చిట్టిముక్కల
నేపాల్ పిల్లల కలల్లో
నా కలం ఇప్పిడు షికార్లు కొడుతోంది

ఆహా ఇప్పుడు నా పద్యం
కరిగి కరిగి నీరవుతున్న రాచరికపు శీతశైలాన్ని చూసి
అట్టహాసంగా నవ్వుతోంది.

Wednesday, September 24, 2008

అమ్మలేనోడు

[శిఖామణి కోసం]

అన్నంలేకపోయినా ఫర్వాలేదు
అమ్మ కావాలి
అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తావు.


ఎప్పుడో ఏడాదికో రెండేళ్ళకో వూరెళ్ళి
అమ్మచేతి ముద్దలు తింటున్నప్పుడు
నువ్వు తటాలున గుర్తుకొస్తావు


జీవితానికి జ్వరంపట్టి సలసలమని మండిపోతుంటే
చల్లగా మనమీదవాలే మబ్బుదుప్పటికదా అమ్మ
నిలవడానికి నీడ లేకున్నా ఫర్వాలేదు
అమ్మ కావాలి.


అమ్మ ఎలావుందోనని
టెలిఫొను తీగల్ని ఒంటికి చుట్టుకుంటూ
నాన్నా అంటూ అమ్మ
నా ఒళ్ళంతా తడిమినప్పుడల్లా
న్నువ్వు చటుక్కున గుర్తుకొస్తావు.


కాలికి నొప్పి తగిలినప్పుడు
గుండెకు దెబ్బతగిలినప్పుడు
’చూసినడుసుకో బిడ్డా’ అంటూ
ఎక్కడోవున్నా అమ్మ పక్కనేవున్నట్టు
జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా
నువ్వు చెంగున గుర్తుకొస్తావు


అమ్మంటే రెండు బాయిలూ ఒకఒడి
ఒక తన్మయత్వపు తడీ మాత్రమే కాదు కదా
అమ్మంటే వాడిపోనిచెట్టు - చినిగిపోనిగొడుగు - ఎండిపోని వాగు.


నాన్నతో ఆడుకునే క్షణాల్లో కూడా
నిద్రపోయే బిడ్డకోసం
తపనపడే బేలతనం కదా అమ్మ


ప్రపంచానికి కావాల్సినన్ని పాలిచ్చి
లేగదూడకోసం దోసేడు చుక్కల్ని కడుపులో దాచుకుని
మనం ఎంత పిండినా చుక్కరాల్చకుండా
పొదుగు ఉగ్గబట్టే ఆవుకదా అమ్మ.


అందుకే నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా
అమ్మ గుర్తుకొస్తుంది
అమ్మ గుర్తుకొస్తే నువ్వు గుర్తుకొస్తావు


అమ్మలేనోడా!
కనపడ్డ పసిపాపనల్లా అమ్మా అంటూ వాటేసుకుని
పద్యాల పాలకోవాలు తినిపిస్తావు
ఎప్పుడు చూసినా
తిరునాళ్ళలో దరితప్పి అమ్మకోసం వెదుకుతున్న
పిల్లాడల్లే కనిపిస్తావు

మా మధ్య కూర్చుని
నువ్వు కవిత్వం కట్టలు విప్పుతుంటే
అమ్మకోసం అంజనం వేస్తున్నట్టే అనిపిస్తుంది.


ఒరే సఖా శిఖా!
మళ్ళీ జన్మంటూ వుంటే
నీకు అమ్మనై పుట్టాలనుందిరా.

Tuesday, September 23, 2008

బడి

[రెయిన్‍బో కాన్సెఫ్ట్ స్కూల్, మహబూబ్‍నగర్, పిల్లలు, టీచర్ల కోసం]

బడంటే బంతిపూల వనంలా ఉండాలి
బదంటే చుక్కపిల్లల్ని అక్కునదాచుకున్న నింగితల్లిలా ఉండాలి
విరగ కాచిన జామ పళ్ళమీద చిలకలు వాలిన చెట్టులా ఉండాలి


బడంటే పుస్తకాలు - పెన్నులూ - పెన్సిళ్ళూ పరీక్షలే కాదు
బడంటే స్నేహం - బడంటే ప్రేమ - బడంటే నమ్మకం.


బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి
బుది బుడి పాదాల తడియారని నాన్న వక్షస్థలంలా ఉండాలి
బడంటే భయం కాదు.... బడంటే బతుకు
బడంటే చదవడం చదివించడమే కాదు
బడంటే వెలగడం - వెలిగించడం
బతకడం - బతికించడం


మునిమాపువేళ తూనీగలు తోటలోకి చొరబడినట్టు
రెక్కల నిండా పుప్పొడి అంటించుకున్న తుమ్మెదల
చెరువు గట్టు మీద ఆటాడుకుంటున్నట్టు
నవ్వుల రవ్వలు విరజిమ్ముతూ
పిల్లలు బడిలోకి అడుగు పెట్టాలి


బడంటే ఆట - బడంటే పాట
బడంటే సామాజిక సామూహిక స్వప్నం.


బడంటే రంగులు పూసుకున్న పసిడి పిట్టలు
తోటలో వసంతమాడుకుంటున్నట్టుండాలి
చదువుతూ నవ్వాలి నవ్వుతూ చదవాలి
బడంటే బాలపరిమళాలు నలుదిశలా వెదజల్లే
వేయిరేకుల వెలుగుపువ్వు.

బడంటే కలలు - బడంటే అలలు
బడంటే ఎదగడం - బడంటే ఎగరడం
బడంటే మనిషి - బడంటే మంచి.

దెయ్యం కల

[ఎన్‍కౌంటర్ చేసి మృతదేహాలను పురుగులు పట్టించి తల్లిదండ్రులకు అందజేసే నీచాన్ని నిరసిస్తూ]

కాకి ముక్కుకి వేలాడుతున్న
మనిషి కనుగుడ్డు నన్ను డిస్టర్బ్ చేసిసింది
ఏ అడవిలో ఏ మృతదేహం నుంది ఎత్తుకొచ్చిందో!

ఒంటినిండా శవాల కంపుతో
ఓ గాలిదయ్యం నా నిద్రపాడుచేసింది.
ఏ అడవిలో మనిషిరక్తంతో తడిసిన ఏ నేలమీంచి
అది నడుచుకుంటూ వచ్చిందో!

మబ్బుల్లో అడవులు కనబడుతున్నాయి.
అడవుల్లోంచి మనుషులు కురుస్తున్నారు
మనుషుల్లోంచి పురుగులు బయటపడుతున్నాయి.
పురుగుల్లో ఏదో గర్వరేఖ మెరుపై నా అక్షరాలను అల్లుకుంటోంది

పురుగులు పట్టిన సినిమాలు
పురుగులు పట్టిన టీవీలు
పురుగులు పట్టిన భవనాలు
పురుగులు పట్టిన ఎస్టేట్లు
పురుగుల రాజు - పురుగుల రాజ్యం

ఇన్ని పురుగులు పట్టిన సజీవ దేహాల మధ్య
ఓ కల కసిగా కలయ తిరుగుతోంది
పురుగులు దేహానికేగాని, కలలకు పట్టించలేరని
అది మన కనురెప్పల్ని మీటుతూ కవ్విస్తోంది.
దయచేసి అ కలను కాల్చండి.
అది మన బిడ్డల మీద కన్నేసింది.

నవ్వాలి

చుక్కలన్నీ ఏదో ఎడారిలో రాల్చేసుకున్న ఆకాశంలా
ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు
అలా చిర్రుబుర్రులొద్దు - ఆ చిటపటలొద్దు


నవ్వాలి - గలగలా - జలజలా


అల్ల బడుల్లోకి పోయి
చిన్న పిల్లల ముందు నిలబడు
నాలుగు నవ్వులు నీ చేతుల్లో పడేస్తారు
తోటల్లో పక్షుల గూళ్ళల్లో తోంగి చూడు
నీ కళ్ళు నవ్వుల దీపాలవుతాయి.


మట్టి మొక్కలా నవ్వుతుంది
చెట్టు నీడలా నవ్వుతుంది


మనం నవ్వితే
ఇల్లంతా మాటలు నేర్చిన మల్లెపందిరవుతుంది
మనం నవ్వితే
వీధులూ ఆఫీసులూ రోడ్లూ
తంబురాలూ-వీణలు-గిటార్లయిపోతాయి
మనకు నవ్వడం కూడా తెలుసని
మన పిల్లలు అబ్బురాల అలలై
ఆనందంతో మన కళ్ళను చుట్టేసుకుంటారు.


నవ్వాలి - హాయిగా - తీయగా


పువ్వులు జలజలా రాల్చుకుంటూ
ఒక చెట్టు మన మధ్యనుండి
అలా నడిచిపోవడం నవ్వు.


ఆఫీసునుండొచ్చిన అమ్మను చూసి
ఉయ్యాల ఆనందంగా ఊగడం నవ్వు.
మాఘమాసం చలిలో
ఓ అనాథ శరీరం మీద
ఉన్నట్టుండి ఒక ఉన్నిశాలువా వాలడం నవ్వు
ఒక పలకరింపు నవ్వు - ఒక స్పర్శ నవ్వు
నవ్వు ఔషధం - నవ్వు అవసరం


చేప పిల్లల్నీ తామరపువ్వుల్నీ
ఒక్క సారే పోగొట్టుకున్న చెరువులా
ఎప్పుడూ అదోలా ఉండొద్దు
నవ్వాలి - ముచ్చటగా - మురిపెంగా.


అజ్ఞాత వీరుల్ని జోకొడుతున్న
అడవి పాట నవ్వు
నలుగురు కూర్చున్న చోట
మానవహక్కుల గీతం గొంతు విప్పినట్టు నవ్వాలి


ప్రేమగా చేయి చాపడం నవ్వు
అణకువగా భుజాలు పంచడం నవ్వు
నవ్వితే ఎగురుతున్న పక్షి
ఓ సారి వెనక్కి చూడాలి
పైకెగసిన కెరటం ఓ సారి ఆగిపోవాలి


నది దేహం మీద పడవరాసిన పాట నవ్వు
ఆకాశానికి పక్షి ఇచ్చే షేక్‍హ్యాండ్ నవ్వు
చెట్టు బుగ్గ మీద గాలి ముద్దు నవ్వు
ప్రకృతి విశ్వవిద్యాలయం
మనుషులకు ప్రస్సదించే పట్టా నవ్వు

నవ్వడం చేతకాక పోతే
బతకడం చేతకానట్టే.

దీక్షిత

చుక్కలన్నీ తనముందు దీక్షగా కూర్చుంటే
అప్పుడు దీక్షిత వాటికి వెలుగుతూ
బ్రతకడం నేర్పుతుంది.

పూలన్నీ తనముందు ముద్దుగా కూర్చుంటే
అప్పుడు దీక్షిత వాటిరేకుల మీద
అమాయకపు నవ్వుల పరిమళాలు అద్దుతుంది.

పక్శులన్నీ తనముందు పరవశంగా వాలితే
అప్పుడు దీక్షిత వాటిరెక్కలమీద
ఒక స్వేఛ్ఛాగీతం రాస్తుంది.

అంతపెద్ద ఆరిందాకూడా
మనం బతుకు బైకు బర్రుమనిపిస్తే
తుర్రుమని తూనీగలా మనవొళ్ళో వాలుతుంది.

ముద్దొచ్చి తనను చేతుల్లోకి తీసుకుంటే
ఎవరో దేవకన్య అలా ఆకాశంలో విహరిస్తూ
నేలకు జారవిడిచిన వజ్రపుటుంగరంలా
ధగధగా మెరిసిపోతుంది

తనివితీరక తనని భుజం మీదికెత్తుకుంటే
విశ్వాంతరాళంలోంచి ఏదో ఒక క్రొత్త గ్రహం
ఈ చిట్టి తల్లి రూపంలో మనమీద వాలినట్లనిపిస్తుంది.

దీక్షితా.......దీక్షితా.......
నిజంగా నీ పుట్టినరోజు వెలుగూ వెన్నెలా
మా తలుపులు తట్టిన రోజు.

పిచ్చి నాన్న

[2006 ఆటా పోటీలలో ఉత్తమ కవితగా ఎంపికైంది]

ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే ఉంటుంది
రెండు వెన్నపూస పెదాలు
నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే ఉంటుంది
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాలలూగుతున్నట్టే అనిపిస్తుంది

చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్లదాక
పప్పీషేములనుండి పట్టుపావడాలదాకా
అదెన్ని వేషాలు మార్చినా
ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే
ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూల జల్లే.

పిల్లల్లో పిల్లలా, అమ్మయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ
నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది.

ఏ శాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది

అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా
అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది

ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా
రంగు రంగుఅ దుస్తుల్లో మా పిల్లే
తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది

క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా
నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి
చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది.

ఎవరికీ కనబడదు గాని
నా నెత్తి మీద ఓ బుల్లి సింహాసనం
దానిలో నా బుజ్జి యువరాణి
ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను అలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే
ఉంటుంది.

దానికిప్పుడు అద్దంలో తన బొమ్మతప్ప
ఏమీ పట్టదుగాని
అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే
నేను టీ డికాక్షన్‍లా మరుగుతూనే ఉంటాను
అది పరీక్షలు రాస్తుంటే
ఆ మూడు గంటలూ రోడ్డు మీద వాహనాలేవీ కదలొద్దని
కసురుకునే ట్రాఫిక్ పోలీసునైపోతాను.

తను చలిలో వణికిపోతే
నేను పత్తికాయనైపగిలిపోతాను
తను జ్వరంతో మండిపోతే
వంద రెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను
తను జబ్బు పడితే మొత్తం వైద్య శాస్త్రాన్నే తప్పుపడతాను.

ఒక్కసారి నవ్విందా
ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని
సజల సంగీతమై ద్రవించిపోతాను.

ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే
ఆకాశానికి నేనే బెలూనై వేలాడుతాను
కొమ్మకొమ్మకీ చాక్లెట్లూ, కేకులూ వేలాడదీసి
పక్షులకు ఫలహారంగా పెడతాను.

ఇప్పుడు తను పెద్దదయ్యింది కదా
నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది
పైగా నన్ను చూసి
’పిచ్చి నాన్న’ అంటూ నవ్వేస్తుంది.

అదేమిటో గాని ఎప్పుడూ
కోతిపిల్ల తల్లిపొట్ట కరుచుకు పట్టుకున్నట్టు
ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో
నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది

నాకు మాత్రం కూతురంటే
ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ
మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.

Monday, September 22, 2008

మిత్రుడొచ్చిన వేళ

ఇంద్రధనుస్సు ఫ్రెండ్‍షిప్ బ్యాండుని
ఆకాశం భూమికి కట్టినట్టు
కెరటాల గుదిగుచ్చి సముద్రం
చంద్రుడి మెడలో వేసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


వేకువ జాము కోకిల గొంతు గుండెతాకినట్టు
అనాదిగా కురిసిన వెన్నెలంతా ఒక్క దోసిట ఒదిగినట్టు
ఉదయ భానుడు తలుపుతట్టి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు
మిత్రుడొచ్చిన వేళ


తెరచిన కొత్త పుస్తకంలోంచి
పక్షులు బిలబిలా ఎగిరినట్టు
పగలూ రాత్రి కలిసి యుగళ గీతమైనట్టు
ఆరు రుతువులు ఏకమై
ఒకే స్నేహరుతువుగా వెలిగినట్టు
మిత్రుడొచ్చిన వేళ


వసంతాన్ని మోసుకుంటూ ఒక చెట్టు
మన ఇంటికి విచ్చేసినట్టు
అద్భుతమేదో జరిగి
అన్ని మతాల పండుగలూ
క్యాలెండర్‍లో ఒక్క రోజే వచ్చినట్టు
ముద్దుల చిన్నారి కొత్త పరికిణి వేసుకుని
పుట్టిన రోజు చాక్లెట్ పంచినట్టు
మిత్రుడొచ్చిన వేళ


ఊరువాడా ఏకమై
గతం గాయాల మరకల్ని కలిసి కడుక్కున్నట్టు
మందిరాల్ని ముస్లింలూ మసీదుల్ని హిందువులు నిర్మిస్తున్నట్టు
కులాలు మతాలు కట్టగట్టుకొని గంగలో దూకేసినట్టు
పసిపాపలా దేవుడు నవ్వినట్టు
మిత్రుడొచ్చిన వేళ


తుపాకుల కత్తుల కర్మాగారంలో
అగరబత్తులు ఉత్పత్తయ్యినట్టు
ప్రపంచంలో అణుబాంబులన్నీ
అకస్మాత్తుగా తుస్సుమన్నట్టు
యుద్ధ విమానాలనుండి పువ్వులు కురిసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


రాజ్యాల మధ్య సరహద్దులు
రాత్రికి రాత్రే మాయమైపోయినట్టు
ఒకప్పుడు మనుషులు యుద్ధాలు చేసుకునే వారంటూ
పిల్లాడెవడో చరిత్ర పాఠం చదువుతున్నట్టు
ఒకేఒక శాంతికపోతం
వెయ్యి సూర్యబింబాల పెట్టయి
ప్రపంచాన్ని వెలిగించినట్టు
మిత్రుడొచ్చిన వేళ


అవినీతి అంటే ఏమిటని
మన్ నాయకులంతా అడిగినట్టు
సన్యాసులూ సన్యాసినులు
రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్టు
బతుకు జీవుడా అని దేవుడు ఊపిరి పీల్చుకున్నట్టు
మిత్రుడొచ్చిన వేళ


ఎన్నికల సమయాన
సారా కొట్టులో పానకం పంచినట్టు
ఒక్క దొంగ ఓటుకూడా లేకుండా
ప్రజాస్వామ్యం పరిమళించినట్టు
మిత్రుడొచ్చిన వేళ


అగ్రవాదం ఉగ్రవాదం
క్షుద్రవాదాలన్నీ
భూమి పొరల్లో నిద్రపోతున్నట్టు
మనిషి గుండె వాకిట
మానవత్వం ఒక వింత పుష్పమై విరిసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


రూపాయి విలువ డాలర్ కంటె
ఎన్నోరెట్లు పెరిగిపోయినట్టు
అమెరికాలోని భారతీయులంతా
హడావుడిగా ఇండియా ఫ్లైటెక్కేసినట్టు
మిత్రుడొచ్చిన వేళ.

[ఆప్త మిత్రుడు కుమార్ అమేరికా నుండి వచ్చిన సందర్భంగా]

Saturday, September 20, 2008

మాట్లాడుకోవాలి

మాట్లాడుకోవాలి
మెత్తగా బత్తాయి పండు తొనలువిప్పినట్టు
మనసువిప్పి మాట్లాడుకోవాలి.

గుండెలోపలికి చేతులు పెట్టి
బయటకుతీసిన మాటల్ని
షవర్ బాత్ చేయించి
ఫ్రెష్‍గా ఎదుటివాళ్ళముందుంచాలి.

మాటలేకదా
అమ్మా నాన్నా గురువు సంఘం
వీళ్ళంతా నీళ్ళు పోసి పెంచిన మాటలే కదా
అంతా చేయి పట్టుకునిలబెట్టిన మాటలే కదా

మాట్లాడితే
అందరికీ కృతజ్ఞతతో అభివాదం చేస్తున్నట్టుండాలి.
అప్పుడే స్నానమాడిన రెండు తడిదేహాలు
తమకంగా కౌగలిచ్చుకున్నట్టుండాలి.

మాట్లాడితే
శుభ్రంగా మంచు కడిగిన నిలువెత్తు అరిటాకుమీద
ఆత్మీయులకోసం నిన్ను నువ్వు వొడ్డించుకున్నట్టుండాలి.

మాటకు బొమ్మేకాని బొరుసులేదు
మాటకు వెలుగేకాని చీకటిలేదు

మనుషుల్లా మాట్లాడుకోవాలి
అందరి ముందు నిన్ను నువ్వుగ్రుమ్మరించేసుకుని
శూన్యంగా చిద్విలాసించాలి.
తొడుగుల్లేని మాటల్ని జేబుల్నిండా నింపుకుని
గృహదేహాల నుండి బయటపడాలి

ఇంట్లోనైనా వీధిలోనైనా
ఆఫీసులోనైనా పార్లమెంటులోనైనా
ప్రేమకోసం స్నేహంకోసం
శాంతికోసం మాట్లాడుకోవాలి.

పంజరంలోనుండి పక్షిని వదిలేసినట్టుండాలి
కొళాయితిప్పితే నీళ్ళురికినట్టుండాలి
నీ నుండి ఏమీ ఆశించని ఓ చిట్టిపాప
చటుక్కున నీ బుగ్గని ముద్దుపెట్టుకున్నట్టుండాలి

మాటలే కదా
మాటలంటే మనుషుల మనసులే కదా
దయచేసి
మాటని మార్కెట్ చేయొద్దు.

Monday, September 15, 2008

ఫ్రెండ్‍షిప్


[ఆంధ్రప్రభ పత్రికలో ౧౫ సెప్టెంబర్ నాడు ప్రచురితమైనది]

స్నేహితుడు ఎలా ఉంటాడంటే
చెట్టుకొమ్మమీంచి
చిత్రంగా ఆకాశంవైపు చూసే
పక్షి రెక్క మీద
నిశ్యబ్దంగా వాలిన వాన చినుకల్లే
ఉంటాడంటాను

రాత్రిపూట సన్నజాజుల
రహస్య సమావేశంలో
చందమామ వినిపించే
స్వాగత గీతంలా ఉంటాడంటాను

అవసరాలు ఆత్మబంధువులవుతున్న కాలంలో
ఆస్తులు ఆలింగనాలవుతున్న రోజుల్లో
మిత్రుడు ఎవడంటే
కారణం తెలీకుండానే ప్రతి ఉదయం
నేలను ముద్దాడే తొలి ముద్దు
కిరణాన్ని చూడమంటాను

అన్నీ ఉంటాయి....
కాని ఏదో వెలితి
ఇంట్లోనూ ఒంట్లోనూ
కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటే
హలో అంకుల్ అని పలకరించే
పక్కింటి చంటి పాపలా సడన్‍గా గుర్తుకొచ్చే
జ్ఞాపకాల సవ్వడే చెలికాడంటాను.

స్నేహమంటే
ఏ అమృతమూ తీర్చలేని దాహమంటాను
ఆత్మలకు మాత్రమే అర్థమయ్యే
మోహమంటాను.

బతుకు అలసటలో
చెమటపట్టిన గుండెకు
చల్లగా తాకే వెన్నెల వింజామర దోస్తు.
బంధాలన్నీ కాసుల దుర్గంధాలవుతుంటే
యారా అన్నమాట కూడా నీ రాబడి
ఆరా తీస్తుంటే.

నీతో కాసేపు కూచోడానిక్కూడా
లాభాన్నీ నష్టాన్నీ కుస్తీ పట్టిస్తుంటే
ఓన్లి నిన్ను చూడ్డానికి మాత్రమే
నీలోన్లీ డ్రీమ్స్ లో తళుక్కున మెరిసే
వెండి వెలుగు ఫ్రెండంటే.

మనమేదో అనుకుంటాంగాని
మంచు ఉన్నట్టే...వాన ఉన్నట్టే
పువ్వులున్నట్టే...సెలయేళ్ల నవ్వులున్నట్టే
మనుషులున్నారు...స్నేహితులూ ఉన్నారు.

నాకు మాత్రం ఫ్రెండ్‍షిప్పంటే
కల్లాకపటం తెలీని పిల్లలు మాత్రమే
ఎప్పుడూ నివాసముండే టౌన్‍షిప్.

[ఫ్రెండ్‍షిప్ డే నాడు అమేరికానుంచి వచ్చిన మిత్రుడు శంకర్ కోసం]






Tuesday, August 19, 2008

నాన్నగారు

నాన్నగారూ మాకు తెలుసు
మీరు అమ్మ దగ్గరికే వెళ్ళారని
ప్రయణాలంటే మీకు ఇష్టమేకదా

మీరు లేరంటే మీరింక తిరిగి రారంటే
ఎందుకో నమ్మలేక పోతున్నాం

పొద్దున్నే కొళాయిలో నీళ్ళచప్పుడు లాగా
మాకు అలవాటైన మీ అడుగుల చప్పుడు కోసం
రిక్కించిన మా చెవుల్ని
నిశ్శబ్దమే వెక్కిరిస్తోంది.

నాన్నగారూ అన్నం తిందాంరండని
అలవాటుగా పిలిస్తే
పక్కనున్న కంచంలో శూన్యం పరిహాసంగా నవ్వుతోంది.

యథాలాపంగా మీరు విశ్రమించే గదివైపు తొంగి చూస్తే
మీ శరీర సౌరభాన్ని కోల్పోయిన మంచం
ఒంటరిగా దిగులు చూపులు విసురుతోంది.

మీరున్నారంటే
ఆకాశమంత ఆశీర్వాదం
మాకు గొడుగుపట్టినట్టుగా ఉండేది

మీరు పక్కనుంటే
ఒక నది పక్కనున్నట్టు
మీరు చెంతనుంటే
చెట్టునీడనున్నట్టు
మీరు మా మధ్యనుంటే
చీకట్లో దీపం చుట్టూ కూర్చున్నట్టు
కొండంతా ధైర్యంగా ఉండేది.

మీరు ఎక్కడున్నా
టెలిఫోనులో అమ్మా అంటూ నాన్నా అంటూ
మీ పలకరింపు వింటే
ఒక చల్లని మబ్బుతునక
మా వీపుల్ని తడుముతున్నట్టుండేది.

ప్రేమించడమేగాని ద్వేషించడం తెలీదు మీకు
క్రమశిక్షణ మీరు మాకిచ్చిన నజరానా
స్థితిప్రజ్ఞత్వానికి మీరే చిరునామా

నాన్నగారూ
మీరు మాకు పాఠాలు భోధించారు కాని
జీవన రహస్యాలు చెప్పలేదు
షెల్ఫ్ లో దాచివుంచిన గొప్ప పుస్తకంలాగా
మీరు మా మధ్యనే ఉన్నా
మిమ్మల్ని చదవడానికి ఏనాడూ మేం సాహసించలేదు.

ఏ మహాగ్రంథాలూ చదవనవసరం లేదు
ఏ మహాయుద్ధాలు చెయ్యనవసరం లేదు
మీ బతుకు పుస్తకాన్ని తెరిస్తే చాలు
మా బతుకుల్ని మేం చక్కదిద్దుకోగలం

మీరు మాస్టారు కదా!
క్రమశిక్షణ తప్పి డబ్బుపొరలు కప్పి
స్వార్థాలు ఏవో మమ్మల్ని విడదీస్తున్నప్పుడు
ద్వేషాలు ఏవో మమ్మల్ని లొంగదీసుకుంటున్నప్పుడు
మళ్ళీ ఒక సారి
బెత్తం పట్టుకుని రావాలి సుమా!

నాన్నగారూ!
అమ్మతో పాటు ఆకాశంలో
మీరలా వాహ్యాళికి వచ్చినప్పుడు
మాకోసం మీ కళ్ళు వెదుకుతున్నప్పుడు
మీ చల్లని దీవెనల విరిజల్లుల కోసం
మేం దోసిళ్ళుపట్టుకు నిలుచుంటాం.

[నన్ను కన్న కొడుకులా ప్రేమించిన మా మామగారు కలపాల వెంకటేశ్వర రావు గారి స్మృతిలో]

Monday, July 28, 2008

పిడికెడు కలలూ దోసెడు జ్ఞాపకాలు

జీవితమంటే
పిడికెడు కలలూ దోసెడు జ్ఞాపకాలే.
జీవితం ఓ విజిట్
ఓ కలయిక ఓ ప్రయాణం.

కలుసుకుంటాం
తల్లీబిడ్డలుగానో అన్నాదమ్ములుగానో
స్నేహితులుగానో ఇరుగుపొరుగ్గానో

కలుసుక్కున్న ప్రతిసారి
మన జ్ఞాపకాల పువ్వు ఓ కొత్త రేకు తొడగాలి
ప్రతి కలయికా
అలసిన కళ్ళకు కలల విసనకర్రలు కానుకగా ఇవ్వాలి.

కలుసుకోవడం నిజానికి
ఒకరినొకరు మళ్ళీమళ్ళీ తెలుసుకోవడానికే
హృదయాలతో ఒకరినొకరు చూసుకోవడానికే.

ఎవరిరెక్కల మీద వాళ్ళు
కొత్త ఆకాశాలను చిత్రించుకుంటూ
అప్పుడప్పుడూ ఓ నీరెండ తామరాకు మీద
పలకరింపుల పిల్ల చేపలై మెరిసిపోవడమే కదా కలుసుకోవడమంటే

ఎవరెవరో ఇక్కడ కలుసుకున్నారు
ప్రేమించుకున్నారు ద్వేషించుకున్నారు
మట్టిమీద గీతలుగీసి
సరిహద్దుల సంబరాలు జరుపుకున్నారు
మనం మళ్ళీమళ్ళీ కలుసుకోవడం
గతం బూజు దులిపేసుకోవడానికే
కలిసివేసే కలల అడుగుల్ని సరిచూసుకోవడానికే.

కలుసుకోవడం చెప్పాలంటే
లాభ నష్టాల క్యాలిక్యులేషన్ కాదు
అది కష్టసుఖాల కల్మినేషన్.

ఎవరి జీవితాలను వాళ్ళు మోసుకుంటూ
వీలైనప్పుడల్లా ఒకరి బరువును ఒకరు
దింపుకోవడమే కదా కలుసుకోవడమంటే!

ఎలాగూ వచ్చాక వెళ్ళడం తప్పదు కాబట్టి
కలుసుకోవడానికే వచ్చాము కాబట్టి
జీవితాన్ని ఉత్సవంగా జరుపుకోవాల్సిసిందే.
నలుగురి నవ్వుల్లో మనబొమ్మను చూసుకోవాల్సిందే.

కలుసుకోవడం
కాలాన్ని దొర్లించుకోవడానిక్కాదు
వెళ్ళిపోయిన క్షణాలను మనవైపు మళ్ళించుకోవడానికే.

కలుసుకుంటే
తరాల మానవ శ్రమకు కృతజ్ఞతగా
తలలు వంచాలి
ఒకరి చెంపల మీద ఒకరు
భరోసా బాష్పకణమై పుష్పించాలి

కలయికలే జీవితం
కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం.