Wednesday, December 3, 2008

ఒబామా! ఒబామా!


కంటికి కునుకు లేదు
రెప్పల మీద నీ చప్పడే
మనసు లోతుల్లో
ఏదో మంచుపొర కరుగుతున్న ఒక నిశ్శబ్ద సౌరభం.
యాభయ్యారక్షరాల నా తెలుగు శౌర్య సౌందర్యం
నీ నీలి దేహం మీద
పూల రేకులై కురుస్తున్న పులకింత

ఒబామా! ఒబామా!
కాలం చాలా తమాషా చేసింది
ఒక యుద్ధ రాక్షసి నెత్తి మీద నిన్ను
నీలి నక్షత్రంలా కూర్చోపెట్టింది
వైట్ హౌస్ ను లైట్ హౌస్ గా మార్చే
బీకన్ కాంతి వలయం నువ్వు కావాలని
చరిత్ర ఆశ పడుతోంది కాబోల

అమెరికా అంటే సామ్రాజ్యమే కాదా
నెత్తుటి కోరల దుర్మార్గమే కదా
నీ గెలుపు నా కలానికిప్పుడు
కనపడని కళ్ళెమై చుట్టుకుంది

రెడ్ ఇండియన్ల ఊచకోతలో
తాగిన నెత్తురు మత్తులో జోగుతున్న దేశం నీది
అణచివేత ఓడలెక్కి
కల్లోల సాగరాల కాగితాల మీద
కపట రచనలు చేసే కోట్లాది కొలంబస్ ల కోట నీది
వియత్నాం నుండి ఇరాక్ దాకా
భోంచేసిన మానవ కళేబరాలు జీర్ణం కాక
రోడ్డురోలర్ లై దొర్లుతున్న డాలర్ డైనోసార్ల రాజ్యం నీది

కాలం ఇప్పుడు ఏదో విచిత్రమే చేసింది
నల్లవాడా!
రక్తం రంగేదో కనుక్కోవాలని
ఆ నెత్తుటి ధారలతో గతం పాపాన్ని కడుక్కోవాలని
ఒక తెల్లవాడు తన చర్మాన్ని ఎన్ని సార్లు కోసుకోవల్సివచ్చిందో
ఎన్ని ఆధిపత్యాల కోటపేటల్ని కూల్చుకోవల్సివచ్చిందో
ఎన్ని అహంకారపు ఆకాశాలను కాల్చుకోవల్సివచ్చిందో

నిన్ను చూసి
నీ విజయోత్సవ సంగీత సవ్వడి విని
ఒక శ్వేత జాతి గుండెకాయ
వెచ్చటి కన్నీటి బొట్టయి
టీవీల తెరల మీద పొరలి పొరలి కదలాడిన దృశ్యం
మనిషి చరిత్రకు కాలం చెప్పిన కొత్త భాష్యం

ఇంతకీ ఇదంతా కల కాదు కదా
ఒబామా అంటే సంక్షోభం గట్టేక్కడానికి
అమెరికన్లు కూడబలుక్కుని ప్రకటించుకున్న
బెయిలౌట్ ప్యాకేజీవి కాదు కదా
నీ రంగు చూసి మేము పొంగిపోవడం లేదు కదా
ఏమో! మాకు మాత్రం నువ్వు
మార్టిన్ లూథర్ కింగ్ స్వప్నంలా కనపడ్తున్నావు
పాల్ రాబ్ సన్ పాటలా వినబడుతున్నావు
ఒబామా! ఒబామా!
శ్వేత సౌధానికే కాదు ప్రపంచ శాంతి సౌధానికి కూడా నువ్వు
కాంతి తోరణమై వేలాడాలి సుమా

భయం లేని ప్రపంచం

నాకు పసిపిల్లల కళ్ళు కావాలి
పావురాల రెక్కల కింద
నిశ్శాబ్దపు నీడల వెచ్చదనం కావాలి

నేను గుడ్డివాడిని కదా
రాత్రి నా రెండు కళ్ళూ
రెండు సజీవ భాష్పకణాలై
నా గుండెన
నిటారుగా చీల్చి
రెండు రెక్కలు చేసుకుని
ఎటో ఎగిరిపోయాయి
ఎవరి పాదాల మీదో మోకరిల్లి
అవి ప్రార్థనలు చేస్తున్నాయి
భయం లేని ప్రపంచం కోసం
ప్రాధేయ పడుతున్నాయి

పువ్వులంటే చెట్టుకీ
చెట్టంటే మట్టికీ
మట్టంటే మనిషికీ
నువ్వంటే నాకూ - నేనంటే నీకూ
నేలంటే ఆకాశానికీ
భయం లేని ప్రపంచాన్ని
కలగన్న నా కళ్ళు నన్ను మోసం చేసి
నా కళ్ళు కప్పి తిరుగుతున్నాయి

బడి పిల్లల ఆటస్థలం
తన గుండె సంగీతమౌతున్న
అడుగుల చప్పుళ్ళని
అసహాయంగా చూస్తోంది
పక్షుల ఆటస్థలం
చుక్కల్ని వెతుక్కుంటూ
ఎవరి చేతులో పట్టుకుని
ఏదో బతిమాలుకుంటోంది
బహుశా భయం లేని
ఆట కోసం కాబోలు

గుడ్డివాడిని కదా
నేను ప్రేమించే అక్షరాలేవో
నన్ను పరామర్శిస్తున్నాయి

వెన్నెలా మంచూ పువుల్లూ పిల్లలూ
నలుగురై
నిన్ను మోసుకుని వెళతారులే అని ఓదారుస్తున్నాయి

భయం లేని స్మశానంలో
నేను తన్మయంగా తగలబడడం
నా కళ్ళు ఆకాశంలోంచి చూసి
రెండు కన్నీటి చుక్కలు ఆనందంగా రాలుస్తున్నాయి
కనీసం పిల్లల కోసమైనా మనం
పెద్ద మనసు చేసుకుని బతుకుదామని
జాలిగా శాసిస్తున్నాయి