Wednesday, December 3, 2008

ఒబామా! ఒబామా!


కంటికి కునుకు లేదు
రెప్పల మీద నీ చప్పడే
మనసు లోతుల్లో
ఏదో మంచుపొర కరుగుతున్న ఒక నిశ్శబ్ద సౌరభం.
యాభయ్యారక్షరాల నా తెలుగు శౌర్య సౌందర్యం
నీ నీలి దేహం మీద
పూల రేకులై కురుస్తున్న పులకింత

ఒబామా! ఒబామా!
కాలం చాలా తమాషా చేసింది
ఒక యుద్ధ రాక్షసి నెత్తి మీద నిన్ను
నీలి నక్షత్రంలా కూర్చోపెట్టింది
వైట్ హౌస్ ను లైట్ హౌస్ గా మార్చే
బీకన్ కాంతి వలయం నువ్వు కావాలని
చరిత్ర ఆశ పడుతోంది కాబోల

అమెరికా అంటే సామ్రాజ్యమే కాదా
నెత్తుటి కోరల దుర్మార్గమే కదా
నీ గెలుపు నా కలానికిప్పుడు
కనపడని కళ్ళెమై చుట్టుకుంది

రెడ్ ఇండియన్ల ఊచకోతలో
తాగిన నెత్తురు మత్తులో జోగుతున్న దేశం నీది
అణచివేత ఓడలెక్కి
కల్లోల సాగరాల కాగితాల మీద
కపట రచనలు చేసే కోట్లాది కొలంబస్ ల కోట నీది
వియత్నాం నుండి ఇరాక్ దాకా
భోంచేసిన మానవ కళేబరాలు జీర్ణం కాక
రోడ్డురోలర్ లై దొర్లుతున్న డాలర్ డైనోసార్ల రాజ్యం నీది

కాలం ఇప్పుడు ఏదో విచిత్రమే చేసింది
నల్లవాడా!
రక్తం రంగేదో కనుక్కోవాలని
ఆ నెత్తుటి ధారలతో గతం పాపాన్ని కడుక్కోవాలని
ఒక తెల్లవాడు తన చర్మాన్ని ఎన్ని సార్లు కోసుకోవల్సివచ్చిందో
ఎన్ని ఆధిపత్యాల కోటపేటల్ని కూల్చుకోవల్సివచ్చిందో
ఎన్ని అహంకారపు ఆకాశాలను కాల్చుకోవల్సివచ్చిందో

నిన్ను చూసి
నీ విజయోత్సవ సంగీత సవ్వడి విని
ఒక శ్వేత జాతి గుండెకాయ
వెచ్చటి కన్నీటి బొట్టయి
టీవీల తెరల మీద పొరలి పొరలి కదలాడిన దృశ్యం
మనిషి చరిత్రకు కాలం చెప్పిన కొత్త భాష్యం

ఇంతకీ ఇదంతా కల కాదు కదా
ఒబామా అంటే సంక్షోభం గట్టేక్కడానికి
అమెరికన్లు కూడబలుక్కుని ప్రకటించుకున్న
బెయిలౌట్ ప్యాకేజీవి కాదు కదా
నీ రంగు చూసి మేము పొంగిపోవడం లేదు కదా
ఏమో! మాకు మాత్రం నువ్వు
మార్టిన్ లూథర్ కింగ్ స్వప్నంలా కనపడ్తున్నావు
పాల్ రాబ్ సన్ పాటలా వినబడుతున్నావు
ఒబామా! ఒబామా!
శ్వేత సౌధానికే కాదు ప్రపంచ శాంతి సౌధానికి కూడా నువ్వు
కాంతి తోరణమై వేలాడాలి సుమా

భయం లేని ప్రపంచం

నాకు పసిపిల్లల కళ్ళు కావాలి
పావురాల రెక్కల కింద
నిశ్శాబ్దపు నీడల వెచ్చదనం కావాలి

నేను గుడ్డివాడిని కదా
రాత్రి నా రెండు కళ్ళూ
రెండు సజీవ భాష్పకణాలై
నా గుండెన
నిటారుగా చీల్చి
రెండు రెక్కలు చేసుకుని
ఎటో ఎగిరిపోయాయి
ఎవరి పాదాల మీదో మోకరిల్లి
అవి ప్రార్థనలు చేస్తున్నాయి
భయం లేని ప్రపంచం కోసం
ప్రాధేయ పడుతున్నాయి

పువ్వులంటే చెట్టుకీ
చెట్టంటే మట్టికీ
మట్టంటే మనిషికీ
నువ్వంటే నాకూ - నేనంటే నీకూ
నేలంటే ఆకాశానికీ
భయం లేని ప్రపంచాన్ని
కలగన్న నా కళ్ళు నన్ను మోసం చేసి
నా కళ్ళు కప్పి తిరుగుతున్నాయి

బడి పిల్లల ఆటస్థలం
తన గుండె సంగీతమౌతున్న
అడుగుల చప్పుళ్ళని
అసహాయంగా చూస్తోంది
పక్షుల ఆటస్థలం
చుక్కల్ని వెతుక్కుంటూ
ఎవరి చేతులో పట్టుకుని
ఏదో బతిమాలుకుంటోంది
బహుశా భయం లేని
ఆట కోసం కాబోలు

గుడ్డివాడిని కదా
నేను ప్రేమించే అక్షరాలేవో
నన్ను పరామర్శిస్తున్నాయి

వెన్నెలా మంచూ పువుల్లూ పిల్లలూ
నలుగురై
నిన్ను మోసుకుని వెళతారులే అని ఓదారుస్తున్నాయి

భయం లేని స్మశానంలో
నేను తన్మయంగా తగలబడడం
నా కళ్ళు ఆకాశంలోంచి చూసి
రెండు కన్నీటి చుక్కలు ఆనందంగా రాలుస్తున్నాయి
కనీసం పిల్లల కోసమైనా మనం
పెద్ద మనసు చేసుకుని బతుకుదామని
జాలిగా శాసిస్తున్నాయి

Saturday, October 18, 2008

ప్రేమ


భూమ్మీద మనిషి కాలాన్ని
ఒక్క రోజులో కుదిస్తే
అది ప్రేమికుల రోజు కావాలి


ప్రపంచం సమాధిలో
రెండు సజీవ ఆత్మలు
సమాధి చుట్టూ
కోట్లాది పాదముద్రలు


జీవితంలోనూ మరణంలోనూ
మరణానంతర జీవితంలోనూ
కురిసే వెలుగుజల్లు ప్రేమే కావాలి


అలకతో ఓ అమ్మాయి విసిరిన పుస్తకాల సంచి
రోడ్డును ప్రేమ లేఖల మొగలి పొత్తు చేసింది


ప్రేమ ఖండాన్ని కనుక్కోవడంలో
ఎవడికి వాడే ఓ కొలంబస్

తనను రోడ్డు దాటించిన చేయి
కబోదికి కలలో కనిపించడం ప్రేమ

స్వార్థమూ త్యాగమూ
కొత్త దంపతుల్లా ఆడుకునే
పూలబంతి ప్రేమ

తెగిన గిటారు తీగల్లో
విషాదమై ప్రవహిస్తున్న పెదాల అన్వేషణ ప్రేమకోసమే
మనుశుల్ని కరెంటు తీగల్ని చేసి
ప్రపంచమ్ పందిరికి వేలాడే బల్బు పువ్వు ప్రేమ
శరీరాల సంగీతానికి
హృదయాలు కూర్చే లిరిక్ ప్రేమ

చెబితే ప్రేమ గురించే చెప్పాలి
మనుషులు ప్రాణాలతో అల్లుకున్న
దీపాల గూటిలో నిత్యం కువకువలాడే
ప్రేమ పక్షి గురించి చెప్పాలి

పాటను వెదుక్కుంటూ పయనమైన
ఒంటరి పడవ
నదిమధ్య కొండకు తలబాదుకోవడం గురించి చెప్పాలి

ఎక్కడో పారేసుకున్న సెల్ ఫోనులో
నువ్వెదురు చూస్తున్న కాల్ మిస్ కావడం ప్రేమ

ప్రేమ ఎస్సెమ్మెస్సులు కాదు
అలాగని ఫ్లయింగ్ కిస్సులూ కాదు

ప్రేమ నాలుగు చేతుల రహస్య ఒప్పందమే కాదు
అది మనిషి నుండి మనిషికి
అనాదిగా ప్రవహిస్తున్న నిశ్యబ్ద సంగీతం

ప్రేమ చీకటి వెన్నుల్లో
మెత్తగా దిగబడే వెన్నెల
ప్రేమ ఎడారి గుండెలో నీటి కత్తి
నిద్దుర రెప్పల మీద మత్తగా జోగే మెలకువ ప్రేమ

ఒక అంధ యువకుడికి
మూగ పిల్ల చేసిన కొంటె సైగ
నిన్నూ నన్నూ వెక్కరిస్తుంది ప్రేమగా

ఎవరిని ఎవరు ప్రేమించినా అందరినీ అందరూ ప్రేమిస్తున్నట్టు
మనుషులంతా ప్రేమికులు కావాలి
రోజులన్నీ ప్రేమికుల రోజులవ్వాలి.

Monday, October 13, 2008

వీరులు ప్రజల హృదయాల్లో ఉంటారు

వీరులు విగ్రహాల్లో కాదు
ప్రజల హృదయాల్లో ఉంటారు
ప్రజల ఆశల్లో ఉంటారు
ప్రజల అడుగుల్లో ప్రజల మాటల్లో
ప్రజల గుండె చెప్పుళ్ళలో
వీరులు గర్వంగా నవ్వుతూ ఉంటారు


విగ్రహాలను మలినం చేస్తే
వీరులు మాయమైపోరు
అది మరో విస్ఫోటానికి నిప్పంటిస్తుంది


విగ్రహాలు కూల్చేస్తే వీరులు చచ్చిపోరు
ఆ విగ్రహాలను తమ రక్తంతో నిర్మించుకున్న
జాతిజనుల ఊపిరిలో ఉంటారు.


సముద్రం మీదికి వొంగిన ఆకాశంలో వీరులుంటారు
సూర్యుడు గుప్పిళ్ళతో జల్లుతున్న
కాంతి కిరణాల్లో వీరులుంటారు
ఉదయాన్ని రెక్కల మోసుకుంటూ
ఎగిరే పక్షుల్లో వీరులుంటారు


అణగదొక్కడం అవమానించడం
మీ సంస్కృతి కావొచ్చు
రెచ్చగొట్టడం చిచ్చుపెట్టడం
మీకు చేతనైన విద్య కావచ్చు


కూలిన విగ్రహాల్లోంచి
కోట్ల పిడికిళ్ళు మొలకెత్తడం
ఇక అందరం చూస్తాం
వీరులు మట్టిబొమ్మల్లోనో చిత్రపటాల్లోనో ఉండరు
ఉక్కు పాదాలు తొక్కిన నేలంతా
పొడుచుకొచ్చిన కత్తుల కాంతుల్లో వీరులుంటారు


కలిసి నడిచే పాదాలు
నేల మీద రాసే నినాదాల్లో వీరులుంటారు
వీరులు జనంలో ఉంటారు
జనం జరిపే రణంలో ఉంటారు
వీరుడు అంబేడ్కర్.

Sunday, October 12, 2008

బౌద్ధ సంగీతం


మాటలు లేని శబ్దాలు లేని
ఒక సంగీత సౌఖ్యం కావాలి

వెన్నెల మాట్లాడదు
పువ్వులూ పిల్లల నవ్వులూ మాట్లాడవు
శాక్యముని నిమీలిత నేత్రాలు కూడ.

ఇది మరో ప్రపంచాన్ని
కలగంటున్న మౌన సంగీతం
మంచు కడిగిన మనుషుల మనస్సుల్ని
భిక్షా పాత్రల నిండా నింపుకుని
సమూహాలు సమూహాలుగా కదలిపోతున్న
కాంతి వలయాల శాంతి సంగీతం

ఆ కదలని విగ్రహంలో
అనాదిగా అనంతంగా కురుస్తున్న ప్రశాంత సంగీతం
మనుషులంతా చిట్టి పిల్లలై
తెలతెల్లని మబ్బుగువ్వలై ఆడుకుంటున్న ఆకాశ సంగీతం
విశుద్ధ వినిర్మల బౌద్ధ సంగీతం

కురుస్తూ కురుస్తూ
కురుస్తూనే మెరుస్తూ
నడుస్తూ నడుస్తూ నడుస్తూనే నవ్వుతూ
ప్రేమ పుష్పాల జడిలో తడుస్తూ
సన్నగా చల్లగా తన్మయంగా
గుండెల్ని తాకే
లౌకికాలౌకిక భౌతికభౌతిక
సాత్విక తాత్విక సంగీతం.

అమ్మ పొట్టలో వినిపించిన సంగీతం
అమ్మ ఉయ్యాలలూపినప్పుడు కన్పించిన సంగీత
బడిలో తోటలో చెట్టుతో నీడలో నీళ్ళతో
ఆడుకున్నప్పుడు మైమరపించిన సంగీతం

చేతుల తీగల్ని ప్రపంచమంతా అల్లుతూ
ప్రవహిస్తున్న పరిమళం సంగీతం
వసుధైక గీతానికి
మొదటి చివరి మంత్ర స్వరం

కాలం కంటే ముందు పుట్టి
కాలం ముందు పరుగు తీస్తున్న
ఒక చిరుపాప చిరునవ్వు సంగీతం

నేలమీద మన మనస్సుల మీద
విస్తరించిన సరిహద్దుల రేఖల్ని
తొక్కుకుంటూ చిందులేసే
సన్యాస సమ్మోహ సంగీతం

మన లోపలా బయట
కనిపించీ కనిపించని ఆయుధాల పైనా
అహంభావాల పైనా
స్వార్థ సామ్రాజ్యాల పైనా
దాడి చేసే నిరాయుధ రహస్య సంగీతం

దిక్కులన్నిటికి దిక్కు చూపే
దేవుళ్ళకు కూడా బుద్ధి చెప్పే
మనుషలందరిని ఒకే ఉయ్యాలలో ఊపే
సజల సంగీతం సౌమ్య సంగీతం
బౌద్ధ సంగీతం

బుద్ధం శరణం గచ్ఛామి......

[గౌతమబుద్ధని 2550వ జయంతిని ఈ ఏడాది ప్రపంచమంతా జరుపుకుంటోంది]

ఆశ ఛావెజ్

పొగచూరిన ఆశల ఆకాశాన్ని
ఒక అరుణారణ రుతు పవనం చల్లగా
కలత చెందే ఆశయాల కనురెప్పలను
ఓ ఎర్రటి చినుకు కొత్త కలై పలకరించింది
ఈ అణచివేతల దమననీతుల కాలంలో
మరో సారి వెనుజులా విప్లవాల ఛీర్స్ కొట్టింది
వీరుడు ఛావెజ్.....ధీరుడు ఛావెజ్
విప్లవం ఛావెజ్..... విక్టరీ ఛావెజ్.

అర్జెంటీనా ఫ్యాక్టరీ గొట్టాల నుండి
దూసుకొస్తున్న ఎర్రని పొగమబ్బుల్లో ఛావెజ్
బొలీవియా నీటి గొంతులో
పోటెత్తిన ఎర్రెర్రని అలల సంగీతంలో ఛావెజ్
లాటెన్ అమెరికా పోరుదారిలో
విరిసే తొలిపొద్దు పువ్వులో ఛావెజ్
ఆశ ఛావెజ్....ఆర్తి ఛావెజ్...

గతించిన వీరుల శౌర్య దీప్తుల్ని
పిడికిట్లో బిగించి వెనుజులా
దెయ్యాల రాజ్యం ఎదుర్రొమ్ముపై గుద్దింది
అణగారిన దేశాల ఆగ్రహ జ్వాలల్ని
కన్నుల్లో నింపుకుని వెనుజులా
కయ్యాల రాజుపై కన్నెర్ర చేసింది
హక్కుల పోరాటానికి కొత్త నెత్తురెక్కింది
విలువల యుద్దానికి ఒక వింత వెపన్ దొరికింది.

ఆకాశాన్ని జెండాగా వెన్నుపూసపై అతికించుకుని
వెనుజులా ప్రపంచమంతా ఎగిరింది
ఊపిరి ఛావెజ్....ఉద్యమం ఛావెజ్
ఇక ఎక్కడబడితే అక్కడ..
పిల్లల కళ్ళల్లో ఛావెజ్
పిల్లల కథల్లో ఛావెజ్
సామ్రాజ్యవాదుల పీడకలల్లో ఛావెజ్

[వెనుజులా ఎన్నికల్లో ఛావెజ్ ఘనవిజయాన్ని స్మరించుకుంటూ...]

జెండాకు సంకెళ్ళు

చాలా రోజులుగా నా కళ్ళు
రాజమండ్రి రహదారిమీద తచ్చాదుతున్నాయి

నా కలం
రాజమండ్రినుండి వచ్చే
బస్సుల్నీ రైళ్ళనీ అదే పనిగా గాలిస్తోంది
ఏవేనో జ్ఞాపకాలు కనురెప్పల మీంచి
టపటపా రాలిపోతూనే వున్నాయి

ఇప్పుడు నా గుండె
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడగడియారం మీద కూర్చుంది
అక్కడ మా మిత్రుడున్నాడు

పోరాడే జెండాలను జైల్లో పెడితే
అవి గోడలకు రెక్కలు తొడుగుతాయి
నినదించే కంఠాలకు సంకేళ్ళు వేస్తే
అవి ఆకాసాన్నే నినాదంగా మార్చేస్తాయి

అతనికి నచ్చిన పాటాలన్నీ జాగ్రత్తగా మడత పెట్టి
సంచినిండా పెట్టుకుని
క్యారియర్ నిండా అక్షరాలు నింపుకొని
నాకు తెలికుండానే నా మనసు ఎప్పుడో
రాజమండ్రి జైలు దగ్గర బైఠాయించింది
అక్కడ మా చెలికాడున్నాడు
విప్లవాల విద్య తెలిసిన విలుకాడున్నాడు.

లోపలికీ బయటకీ తేడా తెలిసిన వాడు
మంచికీ చెడ్డకీ దూరం కొలిచిన వాడు
అందరి మనసూ గెలిచిన వాడు

అక్కడ ఒక తాత్వికుడున్నాడు
ఒక స్వాప్నికుడున్నాడు
ప్రజల ప్రేమికుడున్నాడు

జంగారెడ్డిగూడెం గిరిజనులు కన్నీటితో కట్టిన
స్వాగతమాలను పట్టుకుని
ఇప్పుడు నా రెండు చేతులూ అకాశంలో అలా వేలాడుతున్నాయి.

[ప్రజల పక్షాన పోరాడినందుకు జైలు శిక్ష అనుభవించిన మిత్రుడు మంతెన సీతారాం కోసం]