Tuesday, September 23, 2008

పిచ్చి నాన్న

[2006 ఆటా పోటీలలో ఉత్తమ కవితగా ఎంపికైంది]

ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే ఉంటుంది
రెండు వెన్నపూస పెదాలు
నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే ఉంటుంది
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాలలూగుతున్నట్టే అనిపిస్తుంది

చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్లదాక
పప్పీషేములనుండి పట్టుపావడాలదాకా
అదెన్ని వేషాలు మార్చినా
ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే
ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూల జల్లే.

పిల్లల్లో పిల్లలా, అమ్మయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ
నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది.

ఏ శాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది

అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా
అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది

ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా
రంగు రంగుఅ దుస్తుల్లో మా పిల్లే
తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది

క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా
నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి
చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది.

ఎవరికీ కనబడదు గాని
నా నెత్తి మీద ఓ బుల్లి సింహాసనం
దానిలో నా బుజ్జి యువరాణి
ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను అలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే
ఉంటుంది.

దానికిప్పుడు అద్దంలో తన బొమ్మతప్ప
ఏమీ పట్టదుగాని
అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే
నేను టీ డికాక్షన్‍లా మరుగుతూనే ఉంటాను
అది పరీక్షలు రాస్తుంటే
ఆ మూడు గంటలూ రోడ్డు మీద వాహనాలేవీ కదలొద్దని
కసురుకునే ట్రాఫిక్ పోలీసునైపోతాను.

తను చలిలో వణికిపోతే
నేను పత్తికాయనైపగిలిపోతాను
తను జ్వరంతో మండిపోతే
వంద రెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను
తను జబ్బు పడితే మొత్తం వైద్య శాస్త్రాన్నే తప్పుపడతాను.

ఒక్కసారి నవ్విందా
ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని
సజల సంగీతమై ద్రవించిపోతాను.

ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే
ఆకాశానికి నేనే బెలూనై వేలాడుతాను
కొమ్మకొమ్మకీ చాక్లెట్లూ, కేకులూ వేలాడదీసి
పక్షులకు ఫలహారంగా పెడతాను.

ఇప్పుడు తను పెద్దదయ్యింది కదా
నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది
పైగా నన్ను చూసి
’పిచ్చి నాన్న’ అంటూ నవ్వేస్తుంది.

అదేమిటో గాని ఎప్పుడూ
కోతిపిల్ల తల్లిపొట్ట కరుచుకు పట్టుకున్నట్టు
ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో
నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది

నాకు మాత్రం కూతురంటే
ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ
మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.

No comments: