Monday, September 22, 2008

మిత్రుడొచ్చిన వేళ

ఇంద్రధనుస్సు ఫ్రెండ్‍షిప్ బ్యాండుని
ఆకాశం భూమికి కట్టినట్టు
కెరటాల గుదిగుచ్చి సముద్రం
చంద్రుడి మెడలో వేసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


వేకువ జాము కోకిల గొంతు గుండెతాకినట్టు
అనాదిగా కురిసిన వెన్నెలంతా ఒక్క దోసిట ఒదిగినట్టు
ఉదయ భానుడు తలుపుతట్టి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు
మిత్రుడొచ్చిన వేళ


తెరచిన కొత్త పుస్తకంలోంచి
పక్షులు బిలబిలా ఎగిరినట్టు
పగలూ రాత్రి కలిసి యుగళ గీతమైనట్టు
ఆరు రుతువులు ఏకమై
ఒకే స్నేహరుతువుగా వెలిగినట్టు
మిత్రుడొచ్చిన వేళ


వసంతాన్ని మోసుకుంటూ ఒక చెట్టు
మన ఇంటికి విచ్చేసినట్టు
అద్భుతమేదో జరిగి
అన్ని మతాల పండుగలూ
క్యాలెండర్‍లో ఒక్క రోజే వచ్చినట్టు
ముద్దుల చిన్నారి కొత్త పరికిణి వేసుకుని
పుట్టిన రోజు చాక్లెట్ పంచినట్టు
మిత్రుడొచ్చిన వేళ


ఊరువాడా ఏకమై
గతం గాయాల మరకల్ని కలిసి కడుక్కున్నట్టు
మందిరాల్ని ముస్లింలూ మసీదుల్ని హిందువులు నిర్మిస్తున్నట్టు
కులాలు మతాలు కట్టగట్టుకొని గంగలో దూకేసినట్టు
పసిపాపలా దేవుడు నవ్వినట్టు
మిత్రుడొచ్చిన వేళ


తుపాకుల కత్తుల కర్మాగారంలో
అగరబత్తులు ఉత్పత్తయ్యినట్టు
ప్రపంచంలో అణుబాంబులన్నీ
అకస్మాత్తుగా తుస్సుమన్నట్టు
యుద్ధ విమానాలనుండి పువ్వులు కురిసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


రాజ్యాల మధ్య సరహద్దులు
రాత్రికి రాత్రే మాయమైపోయినట్టు
ఒకప్పుడు మనుషులు యుద్ధాలు చేసుకునే వారంటూ
పిల్లాడెవడో చరిత్ర పాఠం చదువుతున్నట్టు
ఒకేఒక శాంతికపోతం
వెయ్యి సూర్యబింబాల పెట్టయి
ప్రపంచాన్ని వెలిగించినట్టు
మిత్రుడొచ్చిన వేళ


అవినీతి అంటే ఏమిటని
మన్ నాయకులంతా అడిగినట్టు
సన్యాసులూ సన్యాసినులు
రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్టు
బతుకు జీవుడా అని దేవుడు ఊపిరి పీల్చుకున్నట్టు
మిత్రుడొచ్చిన వేళ


ఎన్నికల సమయాన
సారా కొట్టులో పానకం పంచినట్టు
ఒక్క దొంగ ఓటుకూడా లేకుండా
ప్రజాస్వామ్యం పరిమళించినట్టు
మిత్రుడొచ్చిన వేళ


అగ్రవాదం ఉగ్రవాదం
క్షుద్రవాదాలన్నీ
భూమి పొరల్లో నిద్రపోతున్నట్టు
మనిషి గుండె వాకిట
మానవత్వం ఒక వింత పుష్పమై విరిసినట్టు
మిత్రుడొచ్చిన వేళ


రూపాయి విలువ డాలర్ కంటె
ఎన్నోరెట్లు పెరిగిపోయినట్టు
అమెరికాలోని భారతీయులంతా
హడావుడిగా ఇండియా ఫ్లైటెక్కేసినట్టు
మిత్రుడొచ్చిన వేళ.

[ఆప్త మిత్రుడు కుమార్ అమేరికా నుండి వచ్చిన సందర్భంగా]

No comments: