Wednesday, September 24, 2008

అమ్మలేనోడు

[శిఖామణి కోసం]

అన్నంలేకపోయినా ఫర్వాలేదు
అమ్మ కావాలి
అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తావు.


ఎప్పుడో ఏడాదికో రెండేళ్ళకో వూరెళ్ళి
అమ్మచేతి ముద్దలు తింటున్నప్పుడు
నువ్వు తటాలున గుర్తుకొస్తావు


జీవితానికి జ్వరంపట్టి సలసలమని మండిపోతుంటే
చల్లగా మనమీదవాలే మబ్బుదుప్పటికదా అమ్మ
నిలవడానికి నీడ లేకున్నా ఫర్వాలేదు
అమ్మ కావాలి.


అమ్మ ఎలావుందోనని
టెలిఫొను తీగల్ని ఒంటికి చుట్టుకుంటూ
నాన్నా అంటూ అమ్మ
నా ఒళ్ళంతా తడిమినప్పుడల్లా
న్నువ్వు చటుక్కున గుర్తుకొస్తావు.


కాలికి నొప్పి తగిలినప్పుడు
గుండెకు దెబ్బతగిలినప్పుడు
’చూసినడుసుకో బిడ్డా’ అంటూ
ఎక్కడోవున్నా అమ్మ పక్కనేవున్నట్టు
జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా
నువ్వు చెంగున గుర్తుకొస్తావు


అమ్మంటే రెండు బాయిలూ ఒకఒడి
ఒక తన్మయత్వపు తడీ మాత్రమే కాదు కదా
అమ్మంటే వాడిపోనిచెట్టు - చినిగిపోనిగొడుగు - ఎండిపోని వాగు.


నాన్నతో ఆడుకునే క్షణాల్లో కూడా
నిద్రపోయే బిడ్డకోసం
తపనపడే బేలతనం కదా అమ్మ


ప్రపంచానికి కావాల్సినన్ని పాలిచ్చి
లేగదూడకోసం దోసేడు చుక్కల్ని కడుపులో దాచుకుని
మనం ఎంత పిండినా చుక్కరాల్చకుండా
పొదుగు ఉగ్గబట్టే ఆవుకదా అమ్మ.


అందుకే నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా
అమ్మ గుర్తుకొస్తుంది
అమ్మ గుర్తుకొస్తే నువ్వు గుర్తుకొస్తావు


అమ్మలేనోడా!
కనపడ్డ పసిపాపనల్లా అమ్మా అంటూ వాటేసుకుని
పద్యాల పాలకోవాలు తినిపిస్తావు
ఎప్పుడు చూసినా
తిరునాళ్ళలో దరితప్పి అమ్మకోసం వెదుకుతున్న
పిల్లాడల్లే కనిపిస్తావు

మా మధ్య కూర్చుని
నువ్వు కవిత్వం కట్టలు విప్పుతుంటే
అమ్మకోసం అంజనం వేస్తున్నట్టే అనిపిస్తుంది.


ఒరే సఖా శిఖా!
మళ్ళీ జన్మంటూ వుంటే
నీకు అమ్మనై పుట్టాలనుందిరా.

No comments: