Thursday, September 25, 2008

కలల పరిమళాలు

దయచేసి పిల్లల్ని కొట్టొద్దు
పువ్వులు బాధపడతాయి
పిల్లలంటే మాటలూ నడకలూ నేర్చిన మన కలల పరిమళాలు
పిల్లలంటే జీవితమంతా మనం కష్టపడి రాసుకున్న కవితలు.

దయచేసి పిల్లల్నితిట్టొద్దు
చంద్రవంకలు బిక్కమొహం వేస్తాయి
పిల్లల్ని బెత్తాలతో కాదు
ప్రేమనిండిన చిత్తాలతో పలకరించాలి.

వెన్నెల ఒళ్ళంతా పూసుకుని మెరిసిపోతున్న
కోనేటి నీటిని
మునివేళ్ళతో తడిమినట్లు
పిల్లల్ని లాలనగా
స్పృశించాలి
పిండిగువ్వల్ని చేతుల్లో తీసుకున్నట్టు
పిల్లల్ని అక్కున చేర్చుకోవాలి.

దయచేసి పిల్లల్ని కసురుకోవద్దు
చిలకలు చిన్నబోతాయి
పిల్లలు మన తీయ్యటి జ్ఞాపకాలు
పిల్లలు మన రేపటి జాతకాలు.

పాలకంకులమీద పిచ్చుకలు కళ్ళుపారేసుకున్నట్టు
పిల్లల అడుగుల మీద మనం బతుకుల్ని ఆరేసుకోవాలి
పిల్లలు మన ఊహల విహాయసాలు
పిల్లలు మన ఆశల ఆకాశాలు
పిల్లలు మన ప్రతిరూపాలు.

దయచేసి పిల్లల్ని కొట్టొద్దు
ఒళ్ళంతా ప్రేమ నిండిన కళ్ళతో అలా చేతులుచాపండి
వంద హరివిల్లులు మీ దోసిట చిందులేస్తాయి.

No comments: