Saturday, October 11, 2008

వీరులు బతకాలి

ఇల్లు ఖాళీచేసినంత సులువు కాదు
దేహాన్ని ఖాళీ చెయ్యడం


ఎంత సునాయాసంగా ఎంత చిద్విలాసంగా
ఎంత పరిహాసంగా
వెళ్ళి పోయావురా తమ్ముడూ!


ఆఫీసుకు వెళుతూ పిల్లల చేతుల్లో నాలుగు డబ్బులుంచిన్నట్టు
మా కళ్ళల్లో ఒక దుఃఖ సముద్రాన్ని పెట్టి వెళ్ళి పోయావు


అందరం ఇక్కడ ఉండిపోవడానికే రాలేదుగానీ
నువ్వు మాత్రం వెళ్ళిపోవడానికే వచ్చినట్టు
ఒకటే తొందరపడ్డావు


ఈ అగ్నిశిశువును ఎత్తుకోవడం
మా వల్లకాదేమోనని
నీ తొలి ప్రేమ స్పర్శలోనే నాకనిపించింది.


ఒరెయ్ నాయనా
ఇక్కడ బతకడమే గొప్పకదరా!
క్యాలండర్ మీద దుమ్ము దులపడం
గడియారం ముల్లు కదపడం
బతుకంటే బతకడమే
అదే విప్లవం - అదే జీవరహస్యం


ఎవడు ఎన్నేళ్ళు బతికాడన్నదే లెక్క
వందేళ్ళు బతికినవాడే చక్రవర్తి.


నువ్వేంటో చావుని చంకలో పెట్టుకొచ్చినట్టు
ఒకటే కంగారు పడ్డావు
అయితేనేం
బతికిన క్షణకాలమైనా బతుకును బతికించాలన్నవు
వసంతాలు గణించుకోవడం కాదు
అభిశప్తవనాల వాకిళ్ళవైపు పచ్చదనాన్ని తోలుకొచ్చే
వసంతోత్సవానివి నువ్వే కావాలన్నావు.
బతుకంటే అక్షరమన్నావు
గుప్పెడు అక్షరాలను ఎక్కడ ఒలకబోసినా
అవి నిప్పు పిట్టలై
కపటారణ్యాలను
తగలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నావు


అవును నువ్వు పొగరుమోతు కవివే
అనార్కిస్టువే
అంటరాని అక్షరానికి ధిక్కార చొక్కాతొడిగి
కాలరెగరేసుకు తిరగమన్నావు
తెల్లమనువులూ ఎర్రమనువులూ
తెల్ల మొగాలు వేసుకు చూస్తోంటే
వాడమగాడికి మొలతాడుకట్టి
మీసం మెలేసిన మొనగాడివి నువ్వు


నిన్ను చూడ్డానికి
ధైర్యం చాలని వాళ్ళకి తెలీదుగాని
నువ్వు ఉగ్రవాదిగా అగ్రహారాల మీద
బాంబులు విసిరినప్పుడే అనుకున్నాను
ఈ పట్టపగ్గాల్లేని గుర్రాన్ని
పట్టుకోవడం మా చేతకాదని


నువ్విక్కడ ఎవర్నీ చూసి ఎవర్నీ చూసి ఏమీ నేర్చుకోలేదల్లేవుంది
నిత్య సన్మానాలతో నిత్య కళ్యాణాలతో కాకున్నా
నిత్యమూ మృత్యు సంభోగాలతోనైనా
ఇక్కడ బతకడమే గొప్ప

మరి నువ్వేమో
జీవితాన్ని కాలంతో కాదు
కాలాన్ని జీవితంతో లెక్కించాలని
చెప్పడానికే వెళ్ళిపోయినట్టున్నావు

ఓనా ప్రియాతిప్రియమైన సోదరుడా
నువ్వు బతికుంటేనేకదా
ఈ బతుకు బతుకు కాదని తెలుసుకునేవాళ్ళం
నువ్వు సజీవ జీవన ప్రవాహమై
మమ్మల్ని ముంచెత్తితేనెకదా
స్వచ్ఛంగా శుభ్రంగా బతికేసే వాళ్ళం

ఉద్యొగానికి సెలవు పెట్టినంత తెలిక కాదు
జీవితానికి టాటా చెప్పడం.

ఎంత్ ఈజీగా ఎంత పొగరుగా
ఎంత ఆత్మగౌరవంగా
వెళ్ళిపోయావురా నేస్తం!

అది సరె
అవసరాల మచ్చలు కనబడకుండా
ప్రేమ అత్తర్లూ స్నేహాల పౌడర్లూ పూసుకు తిరుగుతున్న
మా బతుకులు నీకు నచ్చలేదు అనుకుందాం
మరి నిన్నే అల్లుకుని పల్లవించిన
ఆ తీగపిల్ల మాటేమిటి!
నీకోసం విరిసిమురిసిన
ఆ జంట పుష్పాల లేతగొంతులు
నాన్నేడని అడిగితే
అన్ని చుక్కల్లో ఏచుక్కని చూపమంటావ్?

నిత్యం వందిమాగదులతో యువరాజులా తిరిగే
చెట్టంత కొడుకు చటుక్కున కూలిపోతే
తల్లడిల్లి పోతున్న ఆ తల్లిపేగు దుఃఖాన్ని వర్ణించడానికి
అక్షరాలను ఏ లోకాలనుండి అరువు తీసుకు రమ్మంటావ్?

ఇక్కడ ఉండిపోవడానికే ఎవరూ రాలేదుగానీ
నువ్వు మాత్రం వచ్చినపని ఆయిపోయినట్టు
వెళ్ళిపోవడానికే కంగారుపడ్డావు

అందుకే తమ్ముడూ
నీ సమాధిమీద తలలుబాదుకుంటూ
మా రక్తంతో ఒకేమాట రాస్తున్నాం
"వీరులు బతకాలి"

[వెలివాడల్లో వేనవేల నగేష్‍బాబులు పుట్టాలని కోరుకుంటూ]

No comments: